Burning Topic: సామాన్యులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు
Burning Topic: సామాన్యులకు మళ్ళీ చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ పై రూ. 29 పెంపు.
Burning Topic: సామాన్యులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు
Burning Topic: ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు మరో షాక్ తగిలింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మళ్లీ పెంచాయి. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.29 అదనంగా వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. పెంచిన ధరలు జూన్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాదిలో రెండోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. గడిచిన మూడు నెలల్లోనే ఎల్పీజీ సిలిండర్ ధర 89 రూపాయలు పెరిగింది.పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ముడి చమురు సరఫరాపై ఏర్పడిన అనిశ్చితి ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో గ్యాస్ దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో దేశీయ చమురు సంస్థలపై ఆర్థిక భారం అధికమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరల సవరణ తప్పనిసరి అయిందని అధికారులు పేర్కొంటున్నారు.
హర్ముజ్ జలసంధి మూతపడిన క్రమంలో అక్కడి నుంచి సరఫరాలు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో మార్చి 7న ఇంటి అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 60 పెంచగా.. ఇప్పుడు రెండోసారి పెంచింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి ఎల్‌పిజి సిలిండర్‌పై సుమారు రూ. 703 నష్టపోతున్నాయి. దీంతో పెంచక తప్పని పరిస్థతి ఏర్పడిందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వల్ల కోట్లాది కుటుంబాలకు కొంత ఉపశమనం లభిస్తున్నప్పటికీ, గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. ఒక సిలిండర్‌ను వినియోగదారునికి అందించడానికి వాస్తవ వ్యయం మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువగా ఉంటుందిగత ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగ గ్యాస్ విక్రయాల కారణంగా చమురు సంస్థలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
కొత్త ధరల అమలుతో మన దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ - రూ.996, ఢిల్లీ - రూ.942, ముంబై - రూ.941.40,
కోల్‌కతా - రూ.968, చెన్నై - రూ.957.50, బెంగళూరు - రూ.944.50
పాట్నా - రూ.1031.50, లక్నో - రూ.980, జైపూర్ - రూ.945.50.
పెరిగిన గ్యాస్ ధరలో పాట్నా మొదటి స్థానంలో ఉంటే, హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. కాగా కొన్ని ఇతర దేశాల కంటే తక్కువ ధరకే భారత్‌లో వంట గ్యాస్ దొరుకుతోందని కేంద్ర చెబుతోంది. అక్కడ వంట గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి.
పాకిస్తాన్ - రూ.1,046, నేపాలు - రూ.1,207, బంగ్లాదేశ్ - రూ.1,225
శ్రీలంక - రూ.1,241, అమెరికా - రూ.1,755, ఆస్ట్రేలియా - రూ.1,765, కెనడా - రూ.2,400
కాగా, వంట గ్యాస్ ధరల పెంపును సమర్థించుకుంటూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో అవాంతరాల తర్వాత ఎల్‌పీజీ ధర గణనీయంగా పెరిగినా ప్రపంచంలో అతి తక్కువ ధర మన దేశంలోనే ఉందని వెల్లడించింది. ఇళ్లకు వంటగ్యాస్ సిలిండర్ సరఫరాకు రూ.1,600కుపైగా ఖర్చవుతోందని పేర్కొంది. సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్‌తో ముడిపడి ఇది మారుతుంటుందని వెల్లడించింది.
మన దేశం మొత్తం ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 60% కంటే ఎక్కువ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇంత మొత్తంలో విదేశాల మీద ఆధారపడడం వల్లనే.. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు మన దేశ ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ.. సాధారణ ప్రజలపై భారం తగ్గించడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది.
ప్రపంచ సంక్షోభం కారణంగా ఎల్‌పీజీ ధరల పెంపు అనివార్యంగా మారిందని కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల కేంద్రం కూడా బాధపడుతోందని, అలాగే విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. ఇంధన రవాణా సజావుగా సాగకపోవడం, చాలా పరిమిత వనరుల నుంచే ఎల్‌పీజీ లభించడం వంటి సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. భారత్‌కు చాలా దూరంలో ఉన్న దేశాల నుంచి కూడా గ్యాస్, ఇంధన సేకరణ జరుగుతోంది. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మూల ధర కూడా అధికంగా ఉంది. అలాగే 40-45 రోజుల రవాణా సమయం కారణంగా బీమా ఖర్చులు కూడా పెరిగాయి. కాబట్టి సామాన్యుల గురించి మాకూ ఆందోళన ఉంది. కానీ అదే సమయంలో గ్యాస్ ధరల పెంపు అనివార్యంగా మారింది అని వెల్లడించారు ప్రహ్లాద్ జోషి.




