పరకామణి కేసుపై జగన్ వ్యాఖ్యలకు జ్యోతుల నెహ్రూ మండిపాటు

పరకామణి కేసుపై జగన్ వ్యాఖ్యలకు  జ్యోతుల నెహ్రూ మండిపాటు
x
Highlights

మంగళగిరి: దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమి జరుగుతుందో పరకామణి కేసే నిదర్శనమని టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో విమర్శించారు....

మంగళగిరి: దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమి జరుగుతుందో పరకామణి కేసే నిదర్శనమని టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసును ‘‘చిన్న దొంగతనం’’గా అభివర్ణించిన వ్యాఖ్యలపై నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి వ్యవహారం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన విషయమని, దానిపై జగన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. టీటీడీలో డబ్బులు లెక్కించేందుకు వెళ్లిన వ్యక్తులు వందల కోట్లు దోచుకున్నప్పుడు, దాన్ని చిన్న దొంగతనం అని చెప్పడం జగన్ హిందూ మతంపై ఉన్న ద్వేషాన్ని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. తాను నమ్మే మతంలో ఇలాంటి సంఘటన జరిగితే జగన్ ఇదే వ్యాఖ్యలు చేసేవారా? అని ప్రశ్నించారు.

జగన్ అవినీతి కేసుల్లో 11 సంవత్సరాలుగా విచారణ నుంచి తప్పించుకునే యత్నం చేస్తున్న వ్యక్తి, పరకామణి కేసుపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. వారిపై వచ్చిన ఆరోపణలను నిజాయితీగా ఎదుర్కోలేకపోవడం వల్లే జగన్ కాలయాపన చేస్తున్నారని, పరకామణి కేసులో జగన్‌తో పాటు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరుల పాత్ర కూడా ఉన్నట్లు స్పష్టం అవుతోందన్నారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి, పరిటాల రవిలకు సంబంధించిన కేసుల్లో సాక్షులను మార్చడం, వ్యవహారాలను మరుగున పడేయడం జరిగిందని చెప్పారు. తాజాగా, ఈ కేసులో ఫిర్యాదు దారుడైన సునీల్ కుమార్ హత్య కావడం కూడా అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ఫిర్యాదుదారుడిని హతమార్చడం, బోర్డు సభ్యులు, బీజేపీ నేతలను బెదిరించడం వంటి పరిస్థితులు బయటపడుతున్నాయని, నిజాలు చెప్పే వారిని వేధించడం, బెదిరించడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు.

ఇలాంటి నికృష్ట కార్యక్రమాలు చేసే వారు ప్రజాసేవకులుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. హిందూ సంప్రదాయాలపై జగన్‌కు విశ్వాసం లేదని ఆరోపిస్తూ, సీఎంగా ఉన్న సమయంలో కూడా తిరుమలకు ఉత్సవాలకు ఒంటరిగా వెళ్లడం దానికి ఉదాహరణ అని నెహ్రూ పేర్కొన్నారు. పరకామణి కేసులో జరిగిన రాజీ కూడా పెద్ద కుట్రలో భాగమేనని, దొంగతనంలో పాలుపంచుకున్నవారిని రక్షించేందుకే ఈ నాటకం జరిగిందని విమర్శించారు. రూ.16 వేల జీతం పొందే ఉద్యోగి వందల కోట్లు ఎలా సంపాదించాడన్న దానిపై గత ప్రభుత్వ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడికి రూ.14 కోట్లను ఒక్కసారిగా దానం చేయాలని ఒత్తిడి తెచ్చి, విషయాన్ని మసకబార్చేందుకు ప్రయత్నించారని నెహ్రూ ఆరోపించారు. కేసులో నిందితుడు రవి ఇచ్చిన ప్రకటన కూడా అనుమానాస్పదమని, అతనిపై ఒత్తిడి తీసుకువచ్చి మరొకరిని రక్షించేందుకు అలా మాట్లాడించారా అన్న సందేహం కలుగుతోందని నెహ్రూ తెలిపారు.పరకామణి విషయంలో జగన్ తప్పకుండా హిందువులకు క్షమాపణ చెప్పాలని, ఈ కేసులో అసలు నిజాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘దొంగలు దొంగతనం చేసి పంచుకున్న పెద్ద కుట్ర ఇది. వెంకటేశ్వర స్వామి దీనిని చూస్తున్నాడు. ఆలస్యమైనా శిక్ష తప్పదు’’ అని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories