AIDS Deaths : తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ మృత్యుఘోష..ఐదేళ్లలో 44 వేల మంది బలి

AIDS Deaths : తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ మృత్యుఘోష..ఐదేళ్లలో 44 వేల మంది బలి
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ మృత్యుఘోష..ఐదేళ్లలో 44 వేల మంది బలి

AIDS Deaths : తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ రక్కసి మళ్లీ పడగ విప్పుతోంది. ఒకప్పుడు ఊరూరా జరిగిన అవగాహన ప్రచారాలు ఇప్పుడు అటకెక్కడంతో, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గత ఐదేళ్లలో మన రెండు రాష్ట్రాల్లో జరిగిన మరణాల లెక్కలు చూస్తే గుండె జారిపోవాల్సిందే. మంగళవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడించిన నిజాలు ఇప్పుడు తెలుగు నేలపై కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మహమ్మారి మళ్ళీ భయాందోళనలు రేకెత్తిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో (2020-2024) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 44,140 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం 1.81 లక్షల మరణాల్లో ఒక్క తెలుగు రాష్ట్రాల వాటాయే 25 శాతంగా ఉండటం గమనార్హం. అంటే దేశంలో చనిపోతున్న ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు మన తెలుగు వాడే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఏపీలో గత ఐదేళ్లలో 32,642 మంది చనిపోగా, తెలంగాణలో 11,498 మంది మరణించారు. ఒకప్పుడు హెచ్‌ఐవీ నియంత్రణలో ఆదర్శంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు మరణాల రేటులో అగ్రస్థానంలో ఉండటం గందరగోళానికి గురిచేస్తోంది. వలస కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు, అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడం ఈ మరణాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఏఆర్‌టీ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మరణాలు పెరగడానికి సామాజిక వివక్ష ప్రధాన అడ్డంకిగా మారింది. సమాజం తమను ఏమనుకుంటుందో అన్న భయంతో చాలా మంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మందులను మధ్యలోనే ఆపేస్తున్నారు. కరోనా సమయంలో మందుల సరఫరాలో తలెత్తిన ఆటంకాలు కూడా బాధితుల ఆరోగ్యంపై దెబ్బకొట్టాయి. పౌష్టికాహార లోపం, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి చేరుకోవడం కూడా మరణాల సంఖ్యను పెంచుతోంది.

గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు నాకో, ఏపీ సాక్స్ వంటి సంస్థలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లేదు. ప్రజల్లో ఎయిడ్స్ అంటే భయం పోయి, నిర్లక్ష్యం పెరిగింది. నివారణే ఏకైక మార్గమని, సురక్షిత అలవాట్లు పాటించకపోతే ముప్పు తప్పదని కేంద్ర గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏఆర్‌టీ సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories