
బటన్ నొక్కితే చాలు.. పొలానికి నీళ్లు..ఏపీ రైతులకు సర్కార్ బంపర్ ఆఫర్
AP Free Agriculture Power : ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఉచిత విద్యుత్ అమలుపై కీలక వివరాలను వెల్లడించారు. రైతులకు భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా 1,02,538 కొత్త కనెక్షన్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 46 వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా వచ్చే సాగు సీజన్ నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఉచిత విద్యుత్ పథకం అమలు కోసం 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.839.44 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు.
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,481 కనెక్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.1059 కోట్లు ఆదా అవుతాయని లెక్కగట్టారు. 11 కేవీ లైన్ల వద్ద సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే 25 ఏళ్ల పాటు విద్యుత్ టారిఫ్ పెరగకుండా స్థిరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకోసం 1035 మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పూర్తయ్యాయని, మే నెల నుంచి పనులు మొదలవుతాయని వెల్లడించారు.
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2028–30 నాటికి 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని చూస్తోంది. ఈ సోలార్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే రైతులకు పగటి పూట 9 గంటల పాటు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు. కేవలం వ్యవసాయానికే కాకుండా గృహ, పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు కూడా మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే తమ శాఖ ప్రధాన లక్ష్యమని గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




