ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట

AP High Court Big Relief To Macherla Mla Pinnelli Ramakrishna Reddy
x

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట

Highlights

AP High Court: పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు

AP High Court: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అభ్యర్థి కావడంతో కౌంటింగ్ ముగిసేవరకూ అరెస్ట్ వద్దన్న పిన్నెల్లి లాయర్ అభ్యర్థనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జూన్ 5 వరకు పిన్నెల్లికి ఊరట లభించింది. ఆరో తేదీన ఇదే కేసుపై మళ్లీ విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది.

ఇటీవలే పూర్తయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల గొడవలు జరిగాయి. మే 13న పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇంత చేసినా కేసు ఎమ్మెల్యేపై కూడా నమోదు చేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం వెంటనే స్పందించింది. సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు నోటీసులు పంపింది.

దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల వరకూ కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పటినుంచీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలించాయి. అయితే పిన్నెల్లి అజ్ఞాతంలోనే ఉంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లిని అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ఈసీ తరఫున న్యాయవాదులు వాదించారు.

అయితే పిన్నెల్లి తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు మాత్రం ఆయన పేరిట విడుదలైన వీడియో ఫేక్ అయి ఉండొచ్చు కదా అనే వాదనను వినిపించారు. టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్‌ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ తతంగంపై పిన్నెల్లి తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యమని ఈసీ నేరుగా ఎలా ఆదేశిస్తారని, కుటుంసభ్యులను పోలీసులు ఇబ్బందిపెడుతున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు జడ్జికి వివరించారు. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో కౌంటింగ్ వరకూ చర్యలొద్దన్న లాయర్ వాదనలతో హైకోర్టు ఏకీభవీంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories