School Holidays: మొంథా తుపాను ఎఫెక్ట్... ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు మూడురోజులపాటు సెలవులు

School Holidays
x

School Holidays: మొంథా తుపాను ఎఫెక్ట్... ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు మూడురోజులపాటు సెలవులు

Highlights

School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించి, కృష్ణా, తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, శాఖాధిపతులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం, అక్టోబర్ 28 సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90–110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ – సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు

అక్టోబర్‌ 26–29 మధ్య రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.

♦ తుపాను ప్రభావం శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు ఉండనుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

♦ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులను ఆదేశించారు.

♦ రిజర్వాయర్ల నీటిమట్టాలను పర్యవేక్షించి, రియల్ టైమ్ సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేయాలని సూచించారు.

♦ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉండాలని, కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవలను ప్రారంభించాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాల వారీగా స్కూళ్లకు సెలవులు

♦ తుపాను ముప్పు నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ముందస్తు సెలవులు ప్రకటించారు.

కృష్ణా జిల్లా: అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు.

తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాలు: అక్టోబర్‌ 27, 28 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు.

♦ మరికొన్ని తీర జిల్లాల్లో కూడా వాతావరణ పరిస్థితుల ఆధారంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ ప్రకారం, అక్టోబర్ 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఎలాంటి సహాయం కావాలన్నా హెల్ప్‌లైన్ 1077కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.

ప్రభుత్వం తుపాను నష్ట నివారణ చర్యలకు పూర్తి సన్నద్ధతతో ఉందని, ప్రజలు అధికారిక వాతావరణ శాఖ సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories