8 నుంచి ఆవకాయ సినిమా, సాహిత్యోత్సవం

8 నుంచి ఆవకాయ సినిమా, సాహిత్యోత్సవం
x
Highlights

తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవాని ఐలాండ్ లో నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.

అమరావతి: తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవాని ఐలాండ్ లో నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఈ వేడుక ద్వారా ఒకే బహిరంగ వేదికపైకి తేనున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.

వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ విభాగంలో సోమవారం మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, టీమ్‌వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్ తో కలిసి ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవంపై పలు అంశాలను వివరించారు.

తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక పద్ధతులకు పెద్దపీట వేస్తూ వేడుక నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ఏపీని సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్, లిటరేచర్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుందన్నారు. కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకత అని తెలిపారు.

తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, అమరావతి-విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యమన్నారు. ఈ ఉత్సవం ఏపీ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, స్థానిక కళాకారులకు, కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆవకాయ్ మంచి వేదిక అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో పర్యాటక రంగం, ప్రజా సంబంధాలను మెరుగుపరచడంలో సంస్కృతిని ఒక బలమైన పిల్లర్‌గా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు 'ఆవకాయ' ప్రతిరూపం అన్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories