‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
x
Highlights

అనకాపల్లిలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

అనకాపల్లి: అనకాపల్లిలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు సీఎం ముచ్చటించారు. వారితోపాటు కొద్ది దూరం పర్యటించారు. వారు చేసే పనులను స్వయంగా దగ్గర ఉండి చూశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజల నుంచి సహకారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో పనికి రాని వస్తువులను తీసుకుని నిత్యావసరాలు ఇచ్చే స్వచ్ఛ రథాన్ని పరిశీలించారు. స్వచ్ఛ రథాలు ఉపయోగపడుతున్నాయా అని స్థానికులు ముఖ్యమంత్రి అడిగారు.

కంపోస్ట్ తయారీ యార్డ్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు. చెత్తను కాంపోస్ట్ గా తయారీ చేసి రైతులకు ఎరువులను అందిస్తున్న కంపోస్ట్ యూనిట్ నిర్వాహాకుడుతో మాట్లాడి అక్కడ పనితీరుని తెలుసుకున్నారు. కంపోస్ట్ యూనిట్ ద్వారా అందించే ఎరువులు రైతులకు ఉపయోగపడుతున్నాయా అని ఓ రైతును అడిగి తెలుసుకున్నారు. దిగుబడి కూడా పెరిగిందని స్థానిక రైతు చెప్పారు.

అనంతరం ప్రజా వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థులు పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తామని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉత్తమ తీరు కనబర్చిన పారిశుధ్య కార్మికులను సీఎం చంద్రబాబు సత్కరించి మొమెంటోలు అందించారు. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ నిర్వహించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఎస్వీడబ్ల్యూతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్, సెర్ప్ మధ్య సీఎం సమక్షంలో ఎంఓయూ జరిగింది.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశం మొత్తం స్ఫూర్తినిచ్చేలా స్వచ్ఛభారత్ కార్యక్రమం నడుస్తోందని చెప్పారు. ప్రజల భాగస్వాములతో ఏ కార్యక్రమం చేసినా అది శాశ్వతంగా ఉంటుందని, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతే కాదు,ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని చెప్పారు.

ముఖ్యమంత్రితో కలిసి ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సహా ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories