Srikakulam Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా తాండవం..

Srikakulam Diarrhea
x

Srikakulam Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా తాండవం..

Highlights

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.

Srikakulam Diarrhea : శ్రీకాకుళం డయేరియా ఘటన, రాజమండ్రి కల్తీ పాల ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమగ్రంగా తెలుసుకున్నారు.

శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి వాకబు చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో తీవ్ర పరిస్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. వారిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

ఈ ఇద్దరి చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇంకా కొత్త కేసులు నమోదవుతున్నాయా అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం ఘటనలో 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు మినహా మిగతా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

ఇక రాజమండ్రి పాల ఘటనకు సంబంధించి బాధితులు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పాల నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై శాఖాపరంగా ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories