Janasena: కాకినాడ జనసేనలో అసమ్మతి చిచ్చు – పదవుల పంచాయితీపై అంతర్గత కలహాలు

Janasena: కాకినాడ జనసేనలో అసమ్మతి చిచ్చు – పదవుల పంచాయితీపై అంతర్గత కలహాలు
x

Janasena: కాకినాడ జనసేనలో అసమ్మతి చిచ్చు – పదవుల పంచాయితీపై అంతర్గత కలహాలు

Highlights

ఆ జిల్లా జనసేన పార్టీలో అసంతృప్తి ముదిరిపాకాన పడిందా..? పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వారిని పక్కనపెట్టి కొత్తవారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జన సైనికులు రగిలిపోతున్నారట.

ఆ జిల్లా జనసేన పార్టీలో అసంతృప్తి ముదిరిపాకాన పడిందా..? పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వారిని పక్కనపెట్టి కొత్తవారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జన సైనికులు రగిలిపోతున్నారట. నామినేటెడ్ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ గాజు గ్లాస్ నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు..? మరి ఇంత జరుగుతున్నా పార్టీ అధినాయకత్వం చూసీ చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తుంది..? ఈ అసమ్మతి మంటల్ని చల్లార్చేందుకు అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుందా..?


కాకినాడ జిల్లా జనసేన పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. పార్టీలో కష్టపడి పని చేసిన.. మొదటి నుంచి జెండా మోసిన నాయకులను పక్కనపెట్టి కొత్తవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్రస్థాయిలో అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ఒకరిద్దరు నాయకులు మాత్రమే రెండు మూడు పదవులు అనుభవిస్తున్నారుంటూ స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, తోట సుధీర్ టార్గెట్‌గా అసమ్మతి జనసేన నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు నామినేటెడ్ పదవులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి మూడు పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారో అర్ధం కావడం లేదని సీనియర్లు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.


మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి పెద్దాపురం అసెంబ్లీ సీటును ఆశించారు తుమ్మల రామస్వామి. కానీ పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకు ప్రతిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా పగ్గాలు అప్పగించి ప్రభుత్వంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామనే హామీ పొందారు ఆయన.

ఈ క్రమంలోనే జిల్లా అధ్యక్ష పదవి.. మరోపక్క కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గానూ ఇలా రెండు పదవుల్లో తుమ్మల రామస్వామి బాబు కొనసాగుతున్నారు. ఈ రెండు పదవులు చాలవన్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్ట్ అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా తుమ్మల బాబుకే కట్టబెట్టారు.


ఇలా వరుసగా మూడు పదవులు ఒకరికే ఇవ్వడాన్ని కాకినాడలోని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన మరో నాయకుడే లేకుండా పోయాడా అని కాకినాడలో నిర్వహించిన ఒక సమావేశంలో సీనియర్లు నిప్పులు చెరిగారట. ఐత దీనిపై తుమ్మల రామస్వామి బాబు వర్గం వాదన మరోరకంగా ఉంది. పెద్దాపురం సీటు ఆశించినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా టిడిపికి కేటాయించినా నిస్వార్ధంగా పనిచేసి కూటమి అభ్యర్థి చిన్నరాజప్ప గెలుపు కోసం తుమ్మల రామస్వామి బాబు కృషి చేశాడని అంటున్నారు. ఆయన ముందుగా డీసీసీ చైర్మన్ పదవి ఆశించారు. కానీ అధిష్టానం (కూడా)- కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవీని కట్టబెట్టారని.. ఇప్పుడు డీసీసీ చైర్మన్ పదవీ రావడం వల్ల త్వరలోనే.. ( కూడా) చైర్మన్‌ పోస్టుకు రాజీనామా చేస్తారని, యాదృచ్ఛికంగా మాత్రమే మూడు పదవులు వచ్చిందని ఆయన వర్గం బలంగా వాదిస్తుంది.


అసంతృప్తి జనసేన నాయకులు ఆ సమావేశంలో తోట సుధీర్ పై కూడా చర్చించారట. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే పార్టీలోకి వచ్చిన తోట సుధీర్‌కు రాష్ట్ర స్థాయి పదవివ్వడం ఎంతవరకు సమంజసమని కొంతమంది జనసేన నాయకులు ఆవేదన చెందుతున్నారు. తోట సుధీర్ పార్టీకి చేసిన సేవలేంటి అనే అంశాన్ని లేవనెత్తుతున్నారు.

వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో తోట సుధీర్ సన్నిహితంగా ఉండేవాడని గుర్తు చేస్తున్నారు. అదే చంద్రశేఖరరెడ్డి జనసేనకు చెందిన వీరమహిళలపై దాడులు చేసి కేసులు పెట్టించిన సమయంలో ఈ సుధీర్ ఎక్కడున్నారు..? వారిని కనీసం పరామర్శించారా..? న్యాయవాది అయిన తోట సుధీర్ రక్షించేందుకు, కేసుల నుంచి విముక్తుల్ని చేసేందుకు ఏమైనా ప్రయత్నించారా..? పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తికి బంధువు కావడమే సుధీర్‌కు ఉన్న అర్హతా అంటూ జనసేన అసమ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఇలా బంధుత్వాలు, స్నేహాలు, అవసరాల పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే పార్టీలో చేరిన వారికి ఇంతటి కీలక పదవులివ్వడం ఎంతవరకు సమంజసమని అసంతృప్తి నేతలు మొన్న జరిగిన సమావేశంలో చర్చించుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న తమకు గుర్తింపు లేదని వాపోతున్నారు. కాకినాడ సిటీలో పార్టీని నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో పార్టీ తరపున కనీస కార్యక్రమాలు నిర్వహించడం గాని, కార్యకర్తల్తో సమావేశాలు గాని ఎప్పుడైనా నిర్వహించారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు కాకినాడలో జనసేన బలంగా ఉండేదని, ఇప్పుడు తన అసమర్థ నాయకత్వంతో సుధీర్ జనసేన ఉనికి కనిపించకుండా చేసేశారంటూ సమావేశంలో అసంతృప్తి నేతలు చర్చించుకున్నారు


మరోవైపు జనసేన వీర మహిళలు సైతం అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పదేళ్ళుగా జనసేన పార్టీ తరపున అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదని... ఇటీవల దేవాలయాలకు వేసిన నూతన కమిటీల్లో ఉన్న మహిళలంతా ఎవరని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వాన్ని, స్థానిక నాయకుల్ని, ప్రజా ప్రతినిధులను సమర్ధవంతంగా ఎదిరించి పార్టీని రక్షించుకున్న వీర మహిళల్ని పక్కనపెట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్న వారికి పార్టీలో ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాకినాడ సిటీలో తోట సుధీర్ కి సన్నితంగా ఉండే వివి స్వామికి జనసేన కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా జనసేన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వివి స్వామి అనే వ్యక్తి వైసీపీకి మద్దతుగా నిలిచాడని కూటమి అధికారంలోకి రాగానే ఆయన జనసేనలో చేరారు. ఇప్పుడు ఏ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్‌ అయినా.. ఆయన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. పదేళ్ళుగా పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు లేని గుర్తింపు అధికారంలో వచ్చాక ఆయనకెలా దక్కుతోందని కొందరు అసమ్మతి నాయకులు బహిరంగంగా విరుచుకుపడ్డారు.


కాకినాడ జిల్లా జనసేన పార్టీలో చెలరేగిన అసంతృప్తిని పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తారో అన్నది జిల్లా నాయకుల్లో సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎలాంటి అసమ్మతులకు తావు లేకుండా ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇచ్చి బుజ్జగిస్తారా లేదా అనేది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories