అమరావతి రైతు ప్రాణంపోయినా కళ్ళు తెరవని ప్రభుత్వం: సీపీఎం

అమరావతి రైతు ప్రాణంపోయినా కళ్ళు తెరవని ప్రభుత్వం: సీపీఎం
x
Highlights

అమరావతి రైతు రామారావు ప్రాణంపోయినా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు మండిపడ్డారు.

అమరావతి: అమరావతి రైతు రామారావు ప్రాణంపోయినా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు మండిపడ్డారు. అమరావతిలోని రాయపూడిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వద్ద రామారావు కుటుంబానికి న్యాయం చేయాలని, అమరావతి రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో అమరావతి రైతులు, రామారావు కుటుంబ సభ్యులు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. రామారావు చిత్రపటాలు, బ్యానర్లు చేతబట్టి న్యాయం చేయాలని నినాదాలు ఇస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

తదనంతరం సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ భార్గవ కు, మున్సిపల్ మంత్రి కార్యాలయం అధికారులకు నేతలు వినతి పత్రాలు సమర్పించారు. రామారావు కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని, రామారావు, రైతులు కోరిన విధంగా ప్లాట్ల కేటాయింపులోని అవకతవకలను సరిదిద్ది తక్షణమే ప్రత్యామ్నాయంగా సరైన ప్లాట్లు కేటాయించాలని వినతి పత్రంలో కోరారు.

వీలైన మేరకు ఇళ్లు కోల్పోకుండా రోడ్ల వెడల్పు చేపట్టాలని, అనివార్యమైతే ఇళ్ల ప్లాట్లు రైతులు కోరినచోట్ల కేటాయించాలని, ఉదారంగా నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ల విస్తరణలోను ప్రణాళికాబద్ధంగా కాకుండా, రోజుకొక ప్రతిపాదనలు పెడుతూ గందరగోళం సృష్టించకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, రుణాలు ఇప్పించాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జరీబు గుర్తింపు, ఉచిత విద్య, వైద్యం, స్థానికులకు ఉపాధి తదితర హామీలు నెరవేర్చాలని కోరారు.

ఆందోళనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు మాట్లాడుతూ, అప్పుడు, ఇప్పుడు అమరావతి రైతులు, ప్రజలకు కష్టాలు తప్పడం లేదన్నారు. రామారావు కుటుంబం, రైతుల పట్ల పాలకులు కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని మాటలే తప్ప, చేతలు లేవన్నారు. అమరావతిలో కార్పొరేట్లకు రెడ్ కార్పెట్, భూములు ఇచ్చిన రైతులకు మొండి చెయ్యి అని నిప్పులు చెరిగారు.

ధర్నాలో సీపీఎం అమరావతి కార్యదర్శి రవి, జిల్లా నేత వెంకటేశ్వర్లు, రైతు నేతలు శివశంకర్, అజయ్ కుమార్, రామారావు కుటుంబ సభ్యులు చుండూరు నరేంద్ర, సిపిఎం నాయకులు ఎం భాగ్యరాజు, కుంభ ఆంజనేయులు, కె రామకృష్ణ, ఎస్కే జానీ, నండూరి శ్రీరామ్మూర్తి, గైరబోయిన నాగేశ్వరరావు,కే ప్రకాష్ రావు, ఎం అంకమ్మరావు, కట్టె పోగు నాగేశ్వరరావు, మేరీ, డి విజయభాస్కర్ రెడ్డి, బర్నబాస్, భాస్కర రావు, బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories