US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి

US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి
x

US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి

Highlights

అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందగా, వారి ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు మృతి చెందగా, వారి ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తీవ్ర విషాదాన్ని నింపింది.

అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న కారు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆయన భార్య ఆశ (40) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న వారి కుమారుడు, కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కృష్ణ కిశోర్ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన కుటుంబంతో కలిసి పాలకొల్లు వచ్చి స్వగ్రామాన్ని సందర్శించి తిరిగి అమెరికా వెళ్లారు. నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్‌కు వెళ్లిన వారు, అనంతరం అమెరికాకు చేరుకున్న కొద్ది రోజులకే ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, బంధువులను కలచివేసింది.

ఇదిలా ఉండగా, ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘన, ముల్కనూరుకు చెందిన భావన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన ఈ యువతులు ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు, మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొలంబియాలో ఒక అపార్ట్‌మెంట్‌లో నికితా గొడిషాల అనే తెలుగు యువతి హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories