Nara Lokesh: ఏపీలో పెట్టుబడులే లక్ష్యం: ఆస్ట్రేలియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం!

Nara Lokesh
x

Nara Lokesh: ఏపీలో పెట్టుబడులే లక్ష్యం: ఆస్ట్రేలియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం!

Highlights

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనను కొనసాగిస్తున్నారు.

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో సిడ్నీలో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆయన ఈ సందర్భంగా ఆహ్వానించారు.

రాష్ట్ర ఎంగేజ్‌మెంట్ అజెండాలో ఏపీని చేర్చాలి!

పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌ను తమ 'స్టేట్ ఎంగేజ్‌మెంట్ అజెండా'లో చేర్చాలని లోకేశ్ ఈ సందర్భంగా ఫోరమ్‌ను కోరారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించనున్న ‘ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్’ సమావేశానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కీలక రంగాల్లో అవకాశాలు: మంత్రి లోకేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన రంగాలైన ఇంధనం, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో ఉన్న అవకాశాలను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సీఈవోలకు వివరించాలని మెక్ కేను కోరారు. ముఖ్యంగా, కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖ సమ్మిట్‌కు ఆహ్వానం

మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా ఒక ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా అందించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్–2025కు ఫోరం నాయకత్వ బృందంతో సహా హాజరు కావాల్సిందిగా లోకేశ్ మెక్ కేను ప్రత్యేకంగా కోరారు. తదుపరి సీఈవోల ఫోరం సమావేశంలో ఏపీకి భాగస్వామ్యం కల్పించాలని, ఆ సెషన్‌లో రాష్ట్రంలోని ప్రాధాన్యత రంగాలను ప్రదర్శిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఫోరం లక్ష్యాలను వివరించిన మెక్ కే

మంత్రి లోకేశ్ విజ్ఞప్తిపై జోడి మెక్ కే స్పందిస్తూ.. ఫోరం కార్యకలాపాలను వివరించారు. ఇరు దేశాల ప్రధానుల చొరవతో 2012లో ప్రారంభమైన ఈ ఫోరం, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం 48.4 బిలియన్ డాలర్ల వాణిజ్య భాగస్వామ్యానికి తమ ఫోరం మద్దతు ఇస్తోందని, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలపై దృష్టి సారించినట్లు ఆమె వివరించారు. విధానపరమైన సహకారం కోసం CIIతో కలిసి పనిచేస్తున్నామని మెక్ కే తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories