Tirupati Updates : తిరుమల భక్తులకు అలర్ట్.. మార్చి 3న 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూత

Tirupati Updates : తిరుమల భక్తులకు అలర్ట్.. మార్చి 3న 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూత
x
Highlights

తిరుమల భక్తులకు అలర్ట్.. మార్చి 3న 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూత

Tirupati Updates : తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. త్వరలో సంభవించబోయే చంద్రగ్రహణం ప్రభావం తిరుమల శ్రీవారి దర్శనాలపై పడనుంది. మార్చి 3వ తేదీన మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో ఆ రోజు ఆలయాన్ని దాదాపు 10.30 గంటల పాటు మూసివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచే శ్రీవారి ఆలయ తలుపులు మూతపడతాయి. తిరిగి గ్రహణానంతరం సాయంత్రం 7.30 గంటలకు తలుపులు తీసి శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రదాయ క్రతువులను నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటల తర్వాతే భక్తులకు స్వామివారి దర్శనం పునఃప్రారంభం అవుతుంది.

గ్రహణం కారణంగా దర్శన టోకెన్ల జారీలోనూ టీటీడీ భారీ మార్పులు చేసింది. మార్చి 2, 3 తేదీల్లో టైమ్ స్లాటెడ్ (SSD) టోకెన్ల జారీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే, ఈ రెండు రోజులకు సంబంధించిన టోకెన్లు అంతకుముందు రోజులు అనగా మార్చి 1, 2 తేదీల్లో కౌంటర్లలో లభించవు. మళ్లీ మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను మార్చి 3వ తేదీన జారీ చేస్తారు. అలాగే మార్చి 3న వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. దీనికి సంబంధించి మార్చి 2వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

దర్శనాలతో పాటు శ్రీవారికి నిత్యం జరిగే ఆర్జిత సేవలకు కూడా గ్రహణం సెగ తగిలింది. మార్చి 3న జరగాల్సిన అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐల కోసం కేటాయించే ప్రత్యేక దర్శన కోటాలను కూడా నిలిపివేసింది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అన్నప్రసాద వితరణపై కూడా నియమాలు అమల్లోకి రానున్నాయి. మార్చి 3న గ్రహణం వీడే వరకు తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని అన్నప్రసాద కేంద్రాలన్నీ మూసివేస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం వంటి వసతి గృహాల్లో భక్తులకు అందించే ఉచిత భోజన సదుపాయం కూడా తాత్కాలికంగా నిలిచిపోతుంది. అయితే, మానవతా దృక్పథంతో తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు మరియు వారి సహాయకులకు మాత్రం ముందస్తుగానే అన్నప్రసాదాలను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు గ్రహణ నియమాలను పాటిస్తూ టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories