Rain Effect: తెలుగురాష్ట్రాలను ముంచెత్తిన మొంథా.. ఊళ్లకు ఊళ్లను చుట్టేసిన వరదలు

Rain Effect: తెలుగురాష్ట్రాలను ముంచెత్తిన మొంథా.. ఊళ్లకు ఊళ్లను చుట్టేసిన వరదలు
x

Rain Effect: తెలుగురాష్ట్రాలను ముంచెత్తిన మొంథా.. ఊళ్లకు ఊళ్లను చుట్టేసిన వరదలు

Highlights

Rain Effect: మొంథా నిలువునా ముంచేసింది... ఎక్కడ చూసినా వర్ష బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి.

Rain Effect: మొంథా నిలువునా ముంచేసింది... ఎక్కడ చూసినా వర్ష బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి.. ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి... వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి...ఇళ్లు వరదల్లో చిక్కుకుని జనం భయం గుప్పిట్లో వణికిపోయారు. వాగులు పొంగి రహదారులు చెరువులను తలపించాయి. తీర ప్రాంతాల్లో తుఫాను అలజడి రేపింది.

ఏపీలో మొంథా తుఫాన్‌ పెను విపత్తుగా మారింది. తుఫాన్ ధాటికి రాష్ట్రమంతా చిగురుటాకులా వణికిపోయింది. ప్రకాశం జిల్లాలో 25 ఏళ్ల తర్వాత గుండ్లకమ్మ చెరువు 15 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒంగోలు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో మునిగిపోయాయి. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్ర గట్టును ఆనుకుని ఉన్న సూరాడ పేట, మాయాపట్నం, మత్స్యకార గృహాలు కూలిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కాకినాడ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోత దశలో ఉన్న దాన్యం, మొక్కలు రాలిపోయాయి. విజయనగరంలో నదులు, చెరువులకు వరదనీరు చేరుతుంది. వందల ఎకరాల్లో వరిపంట, చెరుకుపంటలు నీటమునిగాయి. శ్రీశైలం మహా క్షేత్రంలో మొంథా తుఫాను తీవ్ర ప్రభావం పడింది. పాతళగంగ మెట్ల మార్గంపై కొండ చరియలు విరిగి పడ్డాయి. లింగాల గట్టు దగ్గర పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం అంతా జలమయమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో గ్రామాలు, పట్టణాలు మధ్య రాకపోకలు నిల్చిపోయాయి. జిల్లా కేంద్రంలోని కాలనీలు నీటమునిగి.. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నాగనోలు చెరువు, కేసరి సముద్రం చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుడంతో నాగర్ కర్నూలు–తాడూరు, నాగర్‌కర్నూలు–కోడేరు మార్గాలలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. డిండి ప్రాజెక్ట్ అలుగు పొంగి పొర్లడంతో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

నల్గొండ జిల్లా కొమ్మపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను వర్షపునీరు ముంచెత్తింది. విద్యార్థులు పాఠశాలలోనే చిక్కుకుపోయారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను తాడు సాయంతో క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ప్రాజెక్టు ఏడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను 644.60 అడుగులకు చేరింది. నల్గొండ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో వైపు సూర్యాపేట జిల్లాలో పంట పొలాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దేవరకొండ నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కుండపోత వర్షం కారణంగా దేవరకొండ రూరల్ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల భవనం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories