Operation Satyavedu: ఆపరేషన్‌ సత్యవేడు..శంకర్‌రెడ్డి ఎంట్రీతో సైకిల్‌కు నూతన జోష్‌

Operation Satyavedu: ఆపరేషన్‌ సత్యవేడు..శంకర్‌రెడ్డి ఎంట్రీతో సైకిల్‌కు నూతన జోష్‌
x

Operation Satyavedu: ఆపరేషన్‌ సత్యవేడు..శంకర్‌రెడ్డి ఎంట్రీతో సైకిల్‌కు నూతన జోష్‌

Highlights

సత్యవేడులో టీడీపీకి కొత్త జోష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోటే ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్‌కు బాధ్యతలు జిల్లా రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ రెడ్డి

ఏపీలో కూటమికి అధికారం దక్కిన కొద్ది రోజులకే తిరుపతి జిల్లా సత్యవేడులో రాజకీయ సునామీ వచ్చింది. లైంగిక వేధింపుల కేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే సస్పెన్షన్‌తో... ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీ పట్టు కోల్పోయింది. దిక్కుతోచని స్థితిలో, ఆత్మస్థైర్యం కోల్పోయిన తెలుగు తమ్ముళ్లకు ఓ నాయకుడి రూపంలో ఊహించని విధంగా కొత్త ఉత్సాహం దక్కింది..! నడిపించే నాయకుడు లేని లోటును తీర్చాడు ఆ లీడర్. సత్యవేడులో పసుపు పార్టీకి ఆశాకిరణంలా మారారు. ఇంతకు ఎవరా పవర్‌ఫుల్ లీడర్? టీడీపీని గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న 'ఆపరేషన్ సత్యవేడు' ఏంటి..? అనాథగా మారిన సైకిల్ మళ్లీ అక్కడ ఎలా స్పీడందుకుంది..?


తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ మళ్లీ జోరందుకుంటోంది. కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన నిర్వాకంతో ఇబ్బందుల్లో పడ్డా.. తిరిగి కొత్త కళను సంతరించుకుంటోంది. అధిష్టానం తీసుకున్న ఓ నిర్ణయం పార్టీలో, కేడర్‌లో కొత్త జోష్ నింపుతోందట. సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోటే, నియోజకవర్గ బాధ్యతలను ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్‌కు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. పేరుకు ప్రోగ్రామింగ్ కోఆర్డినేటరే అయినా... నియోజకవర్గ పూర్తి పగ్గాలు ఆయనకే అప్పగించారని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఆ లీడరే.. తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, జిల్లా రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్న కూరపాటి శంకర్ రెడ్డి.


గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు కూరపాటి శంకర్ రెడ్డి. ఐనా తిరుపతి జిల్లాలో సైకిల్ పార్టీ క్యాండిడేట్లతో పాటు.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శంకర్ రెడ్డి చేసిన కృషి అధినేత చంద్రబాబును, యువనేత లోకేష్ దృష్టిని ఆకర్షించింది. అందుకే శంకర్‌రెడ్డికి సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. గతేడాది ఓ వివాదంలో చిక్కుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అప్పటి నుంచి నాయకత్వం లేక అనాథలా మారిన సత్యవేడు సైకిల్ క్యాడర్‌కు... శంకర్‌ రెడ్డి రాకతో మళ్లీ కొత్త ఊపు వచ్చింది.


సత్యవేడు టీడీపీ కో-ఆర్డినేటర్‌గా శంకర్ రెడ్డి నియామకంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా... సత్యవేడులో మాత్రం తెలుగు తమ్ముళ్లకు కనీస మర్యాద దక్కలేదనే ఆవేదన మొన్నటి వరకు ఉండేది. గత వైసీపీ నేతల పెత్తనమే కొనసాగుతోందని... రెడ్ కార్పెట్ ఇంకా వారికే పరిచారని ప్రజలు బాహాటంగా చర్చించుకున్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు... ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా గ్రావెల్, ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళేది ఈ సత్యవేడు నుంచే. గతంలో పెత్తనం చెలాయించిన వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ మాఫియా కార్యకలాపాలు మొన్నటి వరకు యథేచ్ఛగా నడిచాయి. ఈ పరిణామాలన్నింటినీ సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ గమనించారు. వెంటనే చకచకా పావులు కదిపి... సత్యవేడుకు టీడీపీ కోఆర్డినేటర్‌గా శంకర్ రెడ్డిని రంగంలోకి దించారు. దీంతో... నియోజకవర్గంలోని సమస్యలన్నింటికీ చెక్ పడినట్లైంది.


సత్యవేడు నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే శంకర్ రెడ్డి ముందుగా దృష్టి పెట్టింది అక్రమాలపైనే... సత్యవేడులో పాతుకుపోయిన గ్రావెల్, ఇసుక మాఫియాకు ఆయన బ్రేక్ వేశారు. ప్రజల నిత్యవసరాలకు మాత్రమే ఇసుక, గ్రావెల్‌ను వినియోగించుకోవాలని... వాటి వరకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అంతేకాదు... పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిని గుర్తించి, వారికి తగిన ప్రాధాన్యత, పదవులు కట్టబెట్టేందుకు శంకర్ రెడ్డి సిద్ధమయ్యారు. గత మూడు నెలలుగా సైలెంట్‌గా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో అసలైన టీడీపీ కార్యకర్తలను స్వయంగా గుర్తించి... వారిని తన దగ్గరకు పిలిపించుకుని మరీ... వారి సమస్యలను పరిష్కరిస్తుండటం గమనార్హం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ తరపున లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో సత్యవేడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు మళ్లీ పట్టు బిగించారు.


అయితే సత్యవేడులో ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన అక్రమ గ్రావెల్ మాఫియాకి చెక్ పెట్టడంతో... ఆ వర్గం సోషల్ మీడియా వేదికగా శంకర్ రెడ్డిని టార్గెట్ చేసిందట. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేశారట. వైసీపీతో చేతులు కలిపిన కొందరు టీడీపీ నేతల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా బడా కాంట్రాక్టర్‌ అయినప్పటికీ... ఆ ఆరోపణలన్నీ పక్కనపెట్టి... కేవలం పార్టీపై అభిమానంతో, అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఆదేశాలకు కట్టుబడి...సత్యవేడులో టీడీపీని గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు శంకర్ రెడ్డి. ఎలాంటి పదవి, ఫలితం ఆశించకుండానే... పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.


శంకర్‌ రెడ్డిపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా... వాటిని బద్దలు కొట్టడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తోంది తెలుగుదేశం యువ సైన్యం. శంకర్ రెడ్డికి అండగా నిలబడుతూ... సత్యవేడులో సైకిల్ స్పీడ్‌ను మరింత పెంచేందుకు సమాయత్తమవుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories