AP Ministers Ranks: మిస్‌ఫైర్ అవుతున్న మినిస్టర్స్ ర్యాంక్స్ ... చంద్రబాబుకు మళ్లీ తప్పని తిప్పలు

Pawan Kalyan and Nara Lokesh Ranks in AP Cabinet brings out new issues to AP CM Chandrababu Naidu in AP Politics
x

AP Ministers Ranks: చంద్రబాబుకు తిప్పలు తెచ్చిన మంత్రుల ర్యాంకులు

Highlights

AP Ministers Ranks: ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో లోకేశ్ కంటే పవన్ కళ్యాణ్ ర్యాంకులో వెనుకబడటం జనసేన పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పవన్ కళ్యాణ్ దూకుడుతో ఆయన రాజకీయంగా నారా లోకేష్ కంటే ఎక్కువ మైలేజీ సాధిస్తున్నారు.

Pawan Kalyan and Nara Lokesh's Ranks in AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులకు ర్యాంకులు ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ పై చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు రచ్చకు దారి తీశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు 10వ ర్యాంక్ వచ్చింది. నారా లోకేష్‌కు 8వ ర్యాంక్ దక్కింది. ఈ ర్యాంకులు విడుదల చేసిన చంద్రబాబు ఆరోస్థానంలో నిలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటారనే పేరున్న మంత్రులు కూడా ఈ రేసులో వెనుకబడ్డారు. ఇదే ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్ అయింది.

ఎప్పుడూ బిజీగా ఉండే మంత్రులు ఎందుకు వెనుకబడ్డారు? ర్యాంకుల కోసం ఏయే అంశాలను ప్రాతిపాదికగా తీసుకున్నారు? ఈ ర్యాంకులు కూటమిలో కుంపట్లను రాజేశాయా? నష్టనివారణకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టారో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

ఎవరికి ఏ ర్యాంకులు వచ్చాయంటే?

ఫిబ్రవరి 6న కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు ర్యాంకులను ప్రకటించారు. మంత్రివర్గం ఏర్పాటైన నాటి నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ రెండో ప్లేస్‌లో నిలిచారు. కొండపల్లి శ్రీనివాస్ మూడో ప్లేస్, నాదెండ్ల మనోహర్ నాలుగో స్థానంలో నిలిచారు. డోలా బాల వీరాంజనేయులుకు ఐదో ప్లేస్ దక్కింది. ఇక చంద్రబాబు ఆరో ప్లేస్‌లో నిలిచారు.

వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఏడో స్థానంలో ఉంటే నారా లోకేశ్ ఎనిమిది స్థానంతో సరిపెట్టుకున్నారు. బీసీ జనార్ధన్ రెడ్డికి 9వ స్థానం దక్కింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదో ప్లేస్‌లో నిలిచారు. 11వ స్థానంలో సవిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు 12వ స్థానం లభించింది. గొట్టిపాటి రవికుమార్ కు 13వ ప్లేస్, నారాయణకు 14 స్థానం వచ్చింది. టీజీ భరత్, ఆనం రామానారాయణ రెడ్డిలు వరుసగా 15, 16 స్థానాల్లో నిలిచారు. అచ్చెన్నాయుడుకు 17వ స్థానం, రాంప్రసాద్ రెడ్డికి 18వ ప్లేస్ వచ్చింది. గుమ్మడి సంధ్యారాణికి 19వ ప్లేస్ దక్కింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు 20 ప్లేస్ వచ్చింది.

అనగాని సత్యప్రసాద్ కు 21 ప్లేస్ వస్తే, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు 22వ ప్లేస్ దక్కింది. సమాచార శాఖ మంత్రి కె. పార్థసారథికి 23వ ప్లేస్ వచ్చింది. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కు 24వ ప్లేస్ వచ్చింది. 25వ ప్లేస్ లో వాసంశెట్టి సుభాశ్ నిలిచారు.

ర్యాంకులు ఎలా ఇచ్చారంటే?

మంత్రులకు వచ్చే ఫైళ్లు, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తున్నారనే దానిపై ర్యాంకులు ఇచ్చారు. మంత్రివర్గం ఏర్పాటైన రోజు నుంచి డిసెంబర్ చివరి నాటికి ఒక్కో మంత్రి వద్దకు ఎన్ని ఫైళ్లు వచ్చాయి. వాటిలో ఎన్ని క్లియర్ చేశారనే దాని ఆధారంగానే ర్యాంకులు ఇచ్చారు.

ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ర్యాంకు 24. దాదాపు ప్రతి ఫైల్ ఆర్థికశాఖకు వెళ్లాల్సిందే. దీంతో ఫైల్స్ క్లియరెన్స్ లో ఇతర మంత్రులతో ఆయన ర్యాంకింగ్‌లో వెనుకపడ్డారు. పవన్ కళ్యాణ్ కు పంచాయితీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ , అటవీశాఖలున్నాయి.

ఆయన వద్దకు కూడా ఫైల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో ఆయనకు 22వ ర్యాంక్ వచ్చింది. విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ వద్దకు కూడా ఫైల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఫైల్స్ క్లియరెన్స్ లో ఆయనకు ఎనిమిదో ర్యాంక్ వచ్చింది. మొదటి నాలుగు ర్యాంకులు వచ్చిన మంత్రుల్లో ఇద్దరు జనసేనకు చెందినవారున్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో మరో మంత్రి పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

పనితీరుపై గత కొన్ని రోజులుగా సెల్ఫ్ అసెస్‌మెంట్ రిపోర్టు ఇవ్వాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం ఈ రిపోర్టును సీఎంకు అందించారు.మంత్రుల ఓవరాల్ ఫెర్మామెన్స్ పై ర్యాంకులు ఇవ్వడానికి సెల్ఫ్ అసెస్ మెంట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.తమ తమ శాఖల్లో కొత్త సంస్కరణలు ఏమైనా తెచ్చారా? దాని ప్రభావం ఎలా ఉంది? అనే విషయాల గురించి చంద్రబాబు ఆరా తీశారు.

రచ్చకు కారణమైన ర్యాంకులు

మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల అంశం రచ్చకు దారితీసింది. ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ సమావేశానికి వైరల్ ఫీవర్ కారణంగా పవన్ కళ్యాణ్ రాలేదు. పనితీరు మెరుగుపర్చుకోవడం కోసం మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించిన ర్యాంకుల వివరాలను అంతర్గతంగా మంత్రులకు చెబితే సరిపోయేది. అయితే ఈ వివరాలు మీడియాకు పొక్కడం మరింత రచ్చకు కారణమైంది. శాఖలను బట్టి ఫైల్స్ వస్తుంటాయి. కొన్ని శాఖలకు సమస్యలు ఎక్కువగా ఉన్న ఫైల్స్ వస్తాయి. ఇలాంటి ఫైల్స్ ను వెంటనే క్లియర్ చేయడానికి సాధ్యం కాదు.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయితీరాజ్ శాఖకు బెస్ట్ అవార్డు కూడా దక్కింది. ఈ శాఖలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి మార్పును చూడకుండా ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

మంత్రుల ఓవరాల్ పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వకుండా ఫైళ్ల క్లియరెన్స్‌పై ర్యాంకులు ఇవ్వడం కూడా చర్చకు కారణమైంది. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఇచ్చిన ర్యాంకులతో విపక్షాలు మంత్రులపై విమర్శలు చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్టైంది. ఈ ర్యాంకుల్లో టాప్‌లో ఉన్న మంత్రుల పనితీరు బాగా ఉందని, మిగిలిన వారు సరిగా పనిచేయడం లేదని అనుకోవాలా? అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ఈ ర్యాంకులపై వైఎస్ఆర్ సీపీ సెటైర్లు వేసింది. 8, 10 ర్యాంకులు వచ్చిన లోకేశ్, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు.

లోకేశ్ Vs పవన్ కళ్యాణ్

ఫైళ్ల క్లియరెన్స్ లో లోకేశ్ కంటే పవన్ కళ్యాణ్ ర్యాంకులో వెనుకబడ్డారు. పవన్ కళ్యాణ్ దూకుడుతో ఆయన రాజకీయంగా మైలేజీ సాధిస్తున్నారు. అయితే అదే స్థాయిలో టీడీపీ వెనుకబడుతోంది. ఇది రాజకీయంగా టీడీపీకి ఆ పార్టీ యువ నాయకుడు లోకేశ్ కు నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆయనను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ ను తెరమీదికి తెచ్చాయి. ఈ డిమాండ్ తరువాత పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనేది తమ కోరిక అంటూ జనసేన నుంచి వచ్చిన ప్రకటన టీడీపీకి దిమ్మ తిరిగేలా చేసింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించింది.

చంద్రబాబు తాజాగా విడుదల చేసిన ర్యాంకులు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ సి. కృష్ణాంజనేయులు అన్నారు. ఈ ర్యాంకులు కూటమి పార్టీల మధ్య విభేదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగడం చర్చకు దారితీసింది.

నష్ట నివారణకు దిగిన చంద్రబాబు

మంత్రులకు ర్యాంకుల అంశం కూటమి పార్టీల మధ్య గ్యాప్‌నకు పరోక్షంగా కారణమయ్యే అవకాశం ఉందనే చర్చ తెరమీదికి వచ్చింది. దీంతో చంద్రబాబు అలర్టయ్యారు. ఫైళ్ల క్లియరెన్స్ లో విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడమే తమ ఉద్దేశమని చంద్రబాబు అన్నారు. పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ర్యాంకులు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఫైళ్ల క్లియరెన్స్ లో తన స్థానాన్ని కూడా తాను మెరుగుపర్చుకోవాల్సి ఉందని ఆయన వివరించారు.

మంత్రులకు ర్యాంకుల అంశం ఏపీలో అధికారంలో ఉన్న పార్టీల మధ్య చిచ్చుకు బీజం వేసినట్టైంది. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ర్యాంకులతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే జరిగిన నష్టాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నాన్ని సైకిల్ పార్టీ అధినేత ప్రారంభించారు. అయితే ఇది టీ కప్పులో తుఫాన్ గా సమసిపోతోందా? మరింత పెరిగే అవకాశం ఉంటుందా వెయిట్ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories