పోలవరం జిల్లా పేరుపై ప్రాంతీయుల ఆగ్రహం! ‘మా ఊరు లేకుండా ఈ పేరు ఎలా?’

పోలవరం జిల్లా పేరుపై ప్రాంతీయుల ఆగ్రహం! ‘మా ఊరు లేకుండా ఈ పేరు ఎలా?’
x

పోలవరం జిల్లా పేరుపై ప్రాంతీయుల ఆగ్రహం! ‘మా ఊరు లేకుండా ఈ పేరు ఎలా?’

Highlights

పోలవరం జిల్లా ఏర్పాటు, పేరుపై అభ్యంతరాలు పేరుకే పోలవరం అందులో మా ప్రాంతం ఎక్కడంటూ ప్రశ్న తమ ప్రాంతంలేని జిల్లాకు ఆ పేరు ఎలా పెడతారని నిలదీత తమ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తారా అంటూ గరంగరం

ఏపీలో మరో 3 కొత్త జిల్లాలు తెరపైకి వచ్చాయి. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐతే రెండు జిల్లాల ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా.. ఓ జిల్లా విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. మా ప్రాంతం లేకుండానే.. కొత్త జిల్లాకు ఆపేరు ఎలా పెడతారని స్తానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఎంత తాము మన్యం ప్రాంతానికి చెందినవారమైతే అంత చిన్న చూపు చూస్తారా అని మండిపడుతున్నారట. ఏకంగా మా ఊరి పేరునే లాక్కుపోయి తమ ఉనికిని ప్రశ్నార్ధకంగా చేస్తారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారట. ఎవరినో సంతృప్తి పరచడానికి తమకు అడ్రస్ లేకుండా చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారట. ఇంతకీ ఏంటా జిల్లా.. ఆ ప్రాంతం వాసులు ఆగ్రహానికి గురికావడానికి కారణమేంటి తెలుసుకోవాలంటే.


ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు అదే స్థాయిలో అసంతృప్తులు కూడా రగులుతున్నాయి. రాష్ట్రంలో మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో పోలవరం నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. పోలవరం పేరుతో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆ జిల్లా పరిధిలో పోలవరం ప్రాంతంగాని, రాష్ట్రంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా నిలువబోతున్న పోలవరం కానీ నూతన జిల్లా పరిధిలో లేవు. పేరుకే పోలవరం జిల్లా తప్ప అందులో తమ ఊరు లేకుండా చేసి ఎవరి కన్నీళ్ళు తుడవడానికంటూ స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.


రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్స్ పరిధిలోని 11 మండలాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముంపు మండలాలుగా పేరున్న ఈ ప్రాంతానికి పోలవరం జిల్లా అనే పేరు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ జిల్లా పరిధిలోకి రంపచోడవరం, కూనవరం, మారేడుమిల్లి, దేవీపట్నం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వీ.రామచంద్రాపురం, వై.రామవరం, చింతూరు, యటపాక మండలాలు వస్తాయి. కానీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంగాని, రాష్ట్రానికి జీవ నాడిగా చెబుతున్న ప్రాజెక్టు ప్రాంతంగాని ఈ ప్రతిపాదిత జిల్లా పరిధిలోకి రావడం లేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న సమయంలో ప్రాజెక్ట్ ప్రాంతం కానీ, పోలవరం నియోజకవర్గంగాని లేకుండా జిల్లాకు పోలవరం పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.


ఇటీవల జరిగిన ఏలూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కొత్త జిల్లా ఏర్పాటు నిర్ణయంపై ఎమ్మెల్యేలు ప్రశ్నించారట. కొత్త జిల్లా ఏర్పాటుపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోయారని సమాచారం. రాష్ట్రానికి జీవనాడిగా, ఏపీ భవిష్యత్తును మార్చే పోలవరం ప్రాజెక్టుతో సంబంధంలేని ప్రాంతాలకు పోలవరం పేరును పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న మండలాలను కలుపుతూ ఏర్పాటు చేయబోయే జిల్లాకు ఆ ప్రాంతానికి సంబంధించిన వేరే పేరు ఏదైన పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాజెక్ట్ ఒక ప్రాంతంలో ఉంచుకుని మరో ప్రాంతానికి పేరు పెడితే గజిబిజి గందరగోళం తప్ప,,

పైసా ప్రయోజనం ఉండబోదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని స్థానిక నాయకులు చాలా మంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నూతనంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై తమకు ఉన్న అభ్యంతరాలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.


ఇదిలా ఉంటె 2022లో వచ్చిన వరదల సమయంలో పోలవరం నియోజకవర్గ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అవసరమైతే ముంపు మండలాలన్నింటినీ కలిపి పోలవరం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చినట్టు చూపించేందుకే పేరు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భౌగోళికంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అదే గుర్తింపుతో పాటు సెంటిమెంటుతో ముడిపడి ఉన్న పోలవరం పేరును పక్క ప్రాంతానికి పెట్టడంపై అభ్యంతరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పోలవరం పేరును వాడుకుంటూ అందులో తమ ప్రాంతాన్ని కలపకపోవడంపై నియోజకవర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. తాము ఎంత మన్యం ప్రాంతానికి చెందినవారమైతే అంత చిన్న చూపు చూస్తారా అని మండిపడుతున్నారట. ఏకంగా మా పేరునే లాక్కుపోయి తమ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తారా అని సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారట. అయితే పోలవరం జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం 30రోజుల గడువు ఇచ్చింది. దీంతో నూతనంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లాకు పోలవరం పేరును కాకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టాలని తమ వాదనలు వినిపించడానికి స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు.


మరి పోలవరం పేరుతో నూతన జిల్లా ఏర్పాటు విషయంలో వ్యక్తం అవుతున్న అభ్యంతరాలపై ప్రభుత్వం పునః పరిశీలన చేస్తుందా లేక పేరును కొనసాగిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories