
GST Scam AP Restaurants
GST Scam: ఆంధ్రప్రదేశ్‌లోని రెస్టారెంట్లు రూ.70,000 కోట్ల జీఎస్టీ ఎగవేసినట్లు ఐటీ దాడుల్లో తేలింది. బిల్లింగ్ సాఫ్ట్వేర్ ద్వారా డేటాను డిలీట్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
GST Scam: ఆంధ్రప్రదేశ్‌లో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్లు, హోటళ్లు కలిసి ప్రభుత్వానికి ఏకంగా రూ.70,000 కోట్ల మేర నామం పెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ప్రముఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్‌తో పాటు నెల్లూరులోని వెంగమాంబ, రాజమండ్రిలోని బర్కాస్ అరేబియన్ మండి వంటి కీలక ప్రాంతాల్లో ఐటీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. సాదాసీదాగా సాగుతోందనుకున్న ఈ హోటల్ బిజినెస్ వెనుక ఇంతటి భారీ స్కామ్ ఉందన్న విషయం తెలిసి అధికారులు సైతం విస్తుపోతున్నారు. కేవలం ఐదు ఏళ్ల కాలంలోనే ఈ స్థాయిలో పన్ను ఎగవేత జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాఫ్ట్వేర్ మాయాజాలంతో ఈ-గోల్మాల్
అసలు ఈ టాక్స్ చోరీ ఎలా సాగుతోందో తెలుసుకున్న అధికారులకు దిమ్మతిరిగిపోయింది. మనం హోటల్‌కు వెళ్లి భోజనం చేసినప్పుడు వారు ఇచ్చే బిల్లు చూడటానికి అచ్చం అసలు బిల్లులాగే ఉంటుంది. కానీ, అక్కడే అసలు కథ మొదలవుతుంది. రెస్టారెంట్లు వాడుతున్న బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో బ్యాక్ ఎండ్ యాక్సెస్ ద్వారా డేటాను మార్చేస్తున్నారు. వినియోగదారుడు బిల్లు కట్టి బయటకు వెళ్లగానే, సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ ఉపయోగించి ఆ లావాదేవీని రికార్డుల నుంచి మాయం చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో అయితే నెల మొత్తం జరిగిన బిజినెస్ డేటాను ఒక్క క్లిక్‌తో డిలీట్ చేసేస్తున్నట్లు ఐటీ దాడుల్లో తేలింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీతో పాటు, హోటల్ ఆదాయం కూడా లెక్కల్లోకి రాకుండా పోతోంది.
హైదరాబాద్ నుంచి గుజరాత్ దాకా లింకులు
ఈ భారీ స్కామ్ మూలాలు తొలుత హైదరాబాద్‌లోని ఓబెరాయ్ హోటల్ బ్రాంచీల తనిఖీల్లో బయటపడ్డాయి. అక్కడ దొరికిన ఆధారాలతో అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా, ఈ కుంభకోణం నెట్వర్క్ గుజరాత్‌లోని మెయిన్ సర్వర్లకు కనెక్ట్ అయి ఉన్నట్లు గుర్తించారు. టిఫిన్ సెంటర్లు, పబ్ లు, మల్టీ కుజిన్ రెస్టారెంట్లు.. ఇలా ఒకటేమిటి ప్రతిచోటా ఈ డిజిటల్ దొంగతనం యథేచ్ఛగా సాగుతోంది. గుజరాత్‌లోని ప్రధాన సర్వర్లను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడంతో, దేశవ్యాప్తంగా హోటళ్లు చేస్తున్న ఈ బిల్లింగ్ మాయాజాలం బట్టబయలైంది. కేవలం ఏపీలోనే కాదు, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ గోల్మాల్ పతాక స్థాయిలో ఉన్నట్లు సమాచారం.
టాప్ ప్లేస్‌లో కర్ణాటక, తెలంగాణ
ఐటీ శాఖ సేకరించిన గణాంకాల ప్రకారం.. పన్ను ఎగవేతలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ స్కామ్ తీవ్రతను గమనించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ దేశవ్యాప్తంగా తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగానే ఏపీలోని ప్రధాన నగరాల్లో మెరుపు దాడులు జరిగాయి. ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల ఆదాయాన్ని అడ్డగోలుగా నొక్కేస్తున్న ఈ డిజిటల్ దొంగల ఆట కట్టించేందుకు అధికారులు ఇప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మీరు హోటల్లో కట్టే జీఎస్టీ ప్రభుత్వానికి చేరుతోందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




