సారస్ - మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనం

సారస్ - మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనం
x
Highlights

సారస్ - మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు.

గుంటూరు : సారస్ - మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. సారస్ (SARAS - Sale of Articles of Rural Artisans Society -సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన శాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కేంద్ర మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి ఆరు వందల మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారని, 250కు పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్ షీట్ లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సాంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయం జరుగుతుందన్నారు. ఈ మినీ భారత సమ్మేళనానికి పెద్ద ఎత్తున ప్రచారం జరగాలన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలను తిలకించడమే కాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు, హస్త కళలు, చేనేతలు, ఆహార పదార్థాల రుచులను తెలుసుకోవాలని కోరారు. సారస్ కు మంచి బ్రాండింగ్ జరగాలని, పర్యావరణ హిత కార్యక్రమంగా నిలవాలని పిలుపునిచ్చారు.


ప్లాస్టిక్ ఉపయోగించని వేడుకగా నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యర్థాలు నిర్వహణ పట్ల కార్యాచరణ ఉండాలన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో వస్తారనే అంచనా ఉన్నందున అగ్ని ప్రమాదాలు జరగకుండాను, ట్రాఫిక్ రద్దీ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొబైల్ నెట్వర్క్ సమస్య, వైఫై సమస్య ఉండరాదని అన్నారు.

బ్రాండ్ అంబాసిడర్లను ఆహ్వానించాలి

సారస్ - మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుటకు క్రీడలతో పాటు వివిధ రంగాల్లో పేరు మోసిన వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్లుగా సందర్శించే విధంగా ఆహ్వానించాలని మంత్రి సూచించారు.

ఉత్తమ, వినూత్న కళా ప్రదర్శనలు

సారస్ లో భారత దేశ విభిన్న కళలు ఉట్టిపడే విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కొత్త ఆలోచనలకు అవకాశం కల్పించే ప్రదర్శనలు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పారు.


ఆహార శాలలు నవ రుచుల సమ్మేళనం కావాలి

సారస్ లో ఏర్పాటు చేసే ఆహార శాలలలో (ఫుడ్ కోర్టు) ఆహార నాణ్యతలో రాజీ పడరాదని సూచించారు. నవ రుచుల సమ్మేళనం కావాలని, గ్రామీణ వంటకాలు, చిరుధాన్యాల రుచులు అందించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూ ఢిల్లీ నుండి పాల్గొన్న గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి స్వాతి మాట్లాడుతూ సారస్ లో మినీ భారత దేశం కనిపిస్తుందన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ఉండే విధంగా చూడాలని కోరారు. స్వయం సహాయక సంఘాల ఉత్తమ ఉత్పత్తులను ప్రోత్సహించడం సారస్ ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఈ సమావేశంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హాసన్ భాషా, గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి అమరేంద్ర ప్రతాప్ సింగ్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, సెర్ప్ అదనపు సి.ఇ.ఓ ఆర్.శ్రీరాములు నాయుడు, సెర్ప్ డైరెక్టర్ పద్మావతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories