సోషల్ మీడియా ప్రభావం: ఎమ్మెల్యేల ప్రతి మాట ఇప్పుడు వైరల్‌ అవుతుంది

సోషల్ మీడియా ప్రభావం: ఎమ్మెల్యేల ప్రతి మాట ఇప్పుడు వైరల్‌ అవుతుంది
x

సోషల్ మీడియా ప్రభావం: ఎమ్మెల్యేల ప్రతి మాట ఇప్పుడు వైరల్‌ అవుతుంది

Highlights

శక్తివంతమైన అస్త్రంగా సోషల్ మీడియా ఎప్పుడు ట్రోల్ అవుతారో అంచనా వేయాలేని పరిస్థితి అంతర్గత చర్చలు సైతం ప్రజా బాహుళ్యంలోకి క్షణాల్లో సమస్యల సుడిగుండంలోకి నాయకులు ఒక్కసారి వైరల్ అయ్యాక సంజాయిషీ ఇచ్చినా నోయూజ్ మాయని మచ్చగా వ్యక్తిత్వంపై శత్రువులు చేసే విమర్శలు సోషల్ మీడియా గమనిస్తుందని చంద్రబాబు హెచ్చరికలు

ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన సోషల్ మీడియా ఇప్పుడు ప్రజా ప్రతినిధుల మెడకు ఉరితాడుగా మారుతోంది. మూడో కంటిలా ప్రతి నిత్యం నేతల్ని కాపుకాస్తోన్న సోషల్ మీడియా.. ఏదైన తేడా జరిగితే మాత్రం నిలువునా వారి పుట్టి ముంచుతోంది. క్షణాల్లోనే చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తోంది. ఏపీ రాజకీయాలను ఇప్పుడిదే అంశం కుదిపేస్తోంది. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రచారానికి అధికారపక్షం లీడర్లకు ఎంత ఉపయోగపడుతోందో.. అంతే స్తాయిలో ప్రత్యర్థులకూ అస్త్రంగా మారుతోంది. దీంతో ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పనిని త్రినేత్రంలా సోషల్ మీడియా గమనిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి నేతలు పదేపదే హెచ్చరిస్తున్నారు.


సోషల్ మీడియా...నేటి డిజిటల్ యుగంలో ఒక శక్తివంతమైన అస్త్రం. గతంలో అభిప్రాయ ప్రకటనకు, భావ ప్రకటన స్వేచ్ఛకు వేదికైన ఈ ప్లాట్‌ఫామ్స్...ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యక్తిగత క్యారెక్టర్‌పై దెబ్బ కొడుతున్నాయి. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్...ఈ వేదికల్లో ఏ మూల నుంచి ఎప్పుడు ట్రోల్ అవుతారో, ఎవరిపై నెగెటివ్ ప్రచారం మొదలవుతుందో అంచనా వేయాలంటే బహుశా ఆ దేవుడికైనా సాధ్యం కాదేమో…?


వేదికలపై ప్రసంగాలే కాదు... ముఖ్యులతో అంతర్థత చర్చలు, కార్యకర్తతో ఫోన్‌లో మాటామంతి... ఆత్మీయులతో పంచుకున్న రహస్యాలు రెప్పపాటున రికార్డు అవుతున్నాయి. అది ఎప్పటి ఆడియోనో, ఎప్పటి వీడియోనో తెలియకుండానే... క్షణాల్లో సమస్యల సుడిగుండంలోకి రాజకీయ నాయకులను నెట్టేస్తోంది సోషల్ మీడియా. ఒక్కసారి వైరల్ అయ్యాక నాయకులు, కార్యకర్తలు బయటికి వచ్చి ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా, డ్యామేజ్ మాత్రం 100% జరగటం ఖాయం. వ్యక్తిత్వంపై శత్రువులు చేసే విమర్శలు మాయని మచ్చగా మారిపోతున్నాయి. మచ్చను చెరిపే వీలు లేకుండా కొన్ని సందర్భాల్లో పీకల్లోతు కష్టాల్లో మునిగి పోవాల్సి వస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు... సోషల్ మీడియాను వాడండి, కానీ చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. మూడో కన్ను రూపంలో సోషల్ మీడియా మిమ్మల్ని గమనిస్తుంది అని పదేపదే హెచ్చరిస్తున్నారు.


సోషల్ మీడియా రాజకీయ యుద్ధంలో PHD పట్టా పొందారు వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా. వ్యక్తిగత విమర్శలు, ప్రసంగాలకు ఇప్పటికీ, ఎప్పటికీ రోజానే కేరాఫ్ అడ్రస్. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై బురదజల్లాలంటే అందులో రోజా మొదటి వరుసలో ఉంటారనే చెప్పాలి. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు రోజా. అందుకు కౌంటర్‌గా ఆమె వ్యక్తిగత జీవితం, రాజకీయ శైలిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడం చూశాం. ఇప్పుడు అధికార కూటమిలో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లాంటి కొత్త నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… తమ వ్యక్తిగత కార్యక్రమాలను ఫోస్ట్ చేస్తూ… కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు.


ఐతే నేతలు చేసే ప్రతి చిన్న విషయాన్ని, కామెంట్‌ను భూతద్దంలో చూపిస్తూ...తక్షణమే జనంలోకి తీసుకెళ్లడం సోషల్ మీడియా వేదికల్లో నిత్యకృత్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలో పడ్డారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వీడియోల ప్రచారం... ఇద్దరు ముగ్గురు మంత్రుల వ్యవహార శైలిపై నెట్టింట విమర్శలు. జనసేన నేత రాసలీలలు, గుంటూరు, అనంతపురం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆడియోలు, ఏపీ రాజకీయాలను షేక్ చేసేశాయి. గతంలో వైఎస్సార్‌సీపీ నేతల తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసి, పార్టీకి పెద్ద డ్యామేజ్ చేసిందన్న టాక్ ఉంది.


ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఎజెండా, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెడుతుంటే... కొంతమంది ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి కూటమిని డ్యామేజ్ చేస్తోందట. కొందరు ఏ తప్పు చేయకపోయినా ట్రోల్స్‌కు బలి అవుతుంటే, మరికొందరు అతి చేస్తూ ఇట్టే ఇరుక్కుపోతున్నారట. ఇది పార్టీకి, ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ఎంత ప్రచారం చేస్తున్నా... దానిని మించి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వ్యవహారాలే చర్చకు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే.


ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసాసినేషన్ వంటివి క్షమించరానివి. అందుకే... ఎమ్మెల్యేలు, నేతలంతా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండి, తమ ప్రసంగాలపై, ప్రైవేట్ వ్యవహారాలపై మరింత జాగ్రత్త వహించాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే, ఈ సుడిగుండం ఎవర్ని ఎప్పుడు ముంచుతుందో చెప్పలేం.

Show Full Article
Print Article
Next Story
More Stories