Jeelugumilli: గిరిజనుల ఆందోళన, ఆయుధ డిపోకు వ్యతిరేకం

Jeelugumilli: గిరిజనుల ఆందోళన, ఆయుధ డిపోకు వ్యతిరేకం
x

Jeelugumilli: గిరిజనుల ఆందోళన, ఆయుధ డిపోకు వ్యతిరేకం

Highlights

ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో ఉద్రిక్తత ఆయుధ డిపో వద్దంటూ గిరిజనుల ఆందోళన ఆందోళనను అడ్డుకున్న పోలీసులు పోలీసులకు.. నిరసనకారులకు మధ్య తోపులాట జీలుగుమిల్లిలో ఉద్రిక్త పరిస్థితులు గతంలోనే ఆ‍యుధ డిపోను వ్యతిరేకించిన గిరిజనులు

ఏలూరు జిల్లాలో గిరిజనులు చేపట్టిన పోరుబాట రణరంగంగా మారింది. ప్రశాంతమైన జీవితం గడుపుతున్న తమపై నేవీ ఆయుధ డిపో వద్దు అంటూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సభల్లో ఆయుధ డిపో వద్దంటూ తీర్మానం చేశామని..

అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడంతో గిరిజనులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆయుధ డిపోను వెనక్కి తీసుకోకుంటే.. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం గిరిజన ప్రాంతంలో వెయ్యి నూట అరవై ఆరు ఎకరాల్లో నేవీకి సంబంధించి ఆ‍యుధ తయారీ డిపోను ఏర్పాటు చేయడానికి భూములు గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం, రమణక్కపేట, దాట్లగూడెం, కొత్తచీమలవారిగూడెం, మడకంవారిగూడెం గ్రామాల పరిధిలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గతంలో అధికార యత్రాంగం నిర్ధారించింది. నేవీ ఉన్నతాధికారులు వచ్చి ఆ భూములను పరిశీలించారు. 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం గ్రామసభ నిర్వహించగా నేవీ డిపో ఏర్పాటును గిరిజనులు.. స్థానికులు వ్యతిరేకించారు. దీంతో అప్పటి ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఆ‍యుధ డిపో ప్రతిపాదనలను నిలిపివేశారు.

అయితే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుధ డిపో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ శ్రీనివాసులు నేతృత్వంలో గ్రామసభ నిర్వహించి స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి సమస్యా ఉండదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా గిరిజనులు, ప్రజాసంఘాల నేవీ ఆ‍యుధ డిపో ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత మరోసారి గ్రామసభ నిర్వహిస్తే నేవీ డిపో వద్దంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లోని గిరిజనులు ఏజెన్సీకి దూరమయ్యారని ఈ పరిశ్రమ పేరుతో జీలుగుమిల్లి మండలంలోని గిరిజనులను తరిమివేయొద్దంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు.

నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు తాజాగా గ్రామసభతో సంబంధం లేకుండా భూసేకరణకు సమాయత్తం అవుతున్నారన్న విషయం తెలుసుకున్న గిరిజనులు, పోరుబాట పట్టారు. ఆయుధ డిపో ససేమిరా వద్దంటూ ఆందోళనను ఉధృతం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జీలుగుమిల్లి, టి.నర్సాపురం మండలాల్లో సెక్షన్ 30 అమలు చేసి నిరసన ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకు మద్దతు పలికిన గిరిజన, వామపక్ష నేతలను గృహనిర్బంధం చేశారు. దీంతో నిరసనకారులకు గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది.

ఆయుధ డిపో ఏర్పాటుకు భూసేకరణ జరిగిందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పడం అబద్దమని వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామసభ జరగకుండా భూసేకరణ ఎలా చేస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. గిరిజనుల అభిప్రాయాలను గౌరవించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాయకులు హెచ్చరిస్తున్నారు. గిరిజనులు వ్యతిరేకించినా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తే.. ఊరుకునేది లేదని గిరిజనులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories