Tirumala: భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగానే..!!

Tirumala: భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగానే..!!
x
Highlights

Tirumala: భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగానే..!!

Tirumala: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆధ్వర్యంలోని ఆలయాల్లో అన్నప్రసాద వితరణను మరింత విస్తృతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్న ఈవో ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం టీటీడీ పరిధిలో ఉన్న 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని ఈవో తెలిపారు. అయితే మార్చి నెలాఖరులోగా అన్ని టీటీడీ ఆలయాల్లో రోజుకు రెండు పూటలా అన్నప్రసాదం అందించేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం అమలయ్యేలా ముందస్తు ప్రణాళిక అవసరమని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలని ఈవో తెలిపారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసి, అవసరమైన స్థలాలను కూడా కేటాయించాయని ఆయన వివరించారు. ఈ అంశంపై సంబంధిత రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపి, కేటాయించిన స్థలాలను టీటీడీ ఆధీనంలోకి తీసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశంలో ప్రస్తావించాలని అధికారులను ఆదేశించారు.

చెన్నైలో టీటీడీకి కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు, పరిపాలనా అనుమతుల అంశాలను కూడా టీటీడీ బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఈవో సూచించారు. అలాగే రుషికేష్‌లో ఉన్న పిల్గ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్ (PAC) శిథిలావస్థకు చేరుకుందని పేర్కొంటూ, ఇంజనీరింగ్ అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు కొత్త పీఏసీ నిర్మాణానికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన తేదీలను ఖరారు చేయాలని తెలిపారు. వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో ఇప్పటికే 164 మందిని టీటీడీ ఆలయాల్లో నియమించామని, మిగిలిన 536 మందిని ఇతర ఆలయాల్లో నియమించేందుకు ఫిబ్రవరి నెలలో ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో సూచించారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అందిస్తున్న సేవలు, సదుపాయాలపై వస్తున్న ఈ-మెయిల్స్‌ను సమగ్రంగా విశ్లేషించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని తెలిపారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారం నిరంతరం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.

ఇక ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న ముఖ్యమైన పర్వదినాల వివరాలను కూడా టీటీడీ వెల్లడించింది. ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి మరియు మాఘ పౌర్ణమి గరుడ సేవ జరుగనున్నాయి. ఫిబ్రవరి 3న తిరుమొళి శైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, ఫిబ్రవరి 6న కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 28న కుళశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం జరగనుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories