టీటీడీ కఠిన నిర్ణయం: డిప్యూటీ సీఎం అభ్యర్థన తిరస్కరణ

టీటీడీ కఠిన నిర్ణయం: డిప్యూటీ సీఎం అభ్యర్థన తిరస్కరణ
x
Highlights

తిరుమలపై పవిత్రతని, పర్యావరణాన్ని కాపాడే విషయంలో టీటీడీ చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. చివరకు ప్రభుత్వ ప్రముఖల అభ్యర్థలను కూడా తిరస్కరిస్తోంది.

తిరుమల: తిరుమలపై పవిత్రతని, పర్యావరణాన్ని కాపాడే విషయంలో టీటీడీ చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. చివరకు ప్రభుత్వ ప్రముఖల అభ్యర్థలను కూడా తిరస్కరిస్తోంది. తిరుమలలో పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలకు అతిథిగృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చేసిన అభ్యర్థనలను టీటీడీ తిరస్కరించింది.

తమ అవసరాల దృష్ట్యా తిరుమలలో తమకు ప్రత్యేకంగా అతిథిగృహం అవసరమని, అందుకు తిరుమల కొండపైన రెండు ఎకరాల భూమి కేటాయించాలని కోరుతూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ టీటీడీకి లేఖ రాశారు. అలాగే, పంచాయతీరాజ్‌ భవన్‌ పేరుతో అతిథిగృహం నిర్మించుకోవడానికి తిరుమలలో స్థలం కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం నుంచి కూడా టీటీడీకి లేఖ వెళ్లింది.


ఈ నెల 16న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ రెండు లేఖలపై చర్చించారు. కొండపైన భూమి లభ్యత పరిమితంగా ఉన్నందున కొంత కాలం నుంచి కొత్త నిర్మాణాలపై నిషేధం ఉంది. ఈ విషయంలో హైకోర్టు కూడా పలు పరిమితులు విధించింది. టీటీడీ కూడా కొత్త నిర్మాణాలు ఏవీ చేపట్టకుండా, శిథిలావస్థకు చేరిన గెస్ట్‌హౌస్‌లు, కాటేజీలను మాత్రమే పునర్నిర్మించడానికి పరిమితమవుతోంది.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, మంత్రుల అభ్యర్థనలను టీటీడీ పాలకమండలి తిరస్కరించింది. అయితే, ప్రత్యామ్నాయంగా తిరుమలలో ఇప్పటికే వున్న అతిథిగృహాల్లో ఒక భవనాన్ని ఆయా శాఖలకు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో, ఆ శాఖల అవసరాలు తీరతాయని భావిస్తున్నారు. గెస్ట్ హౌస్‌లు, భూముల కేటాయింపులపై నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories