
Uppada: కాకినాడ జిల్లా ఉప్పాడ తీర సమస్య ఏమిటి?
కాకినాడ జిల్లా ఉప్పాడ తీర సమస్య ఏమిటి? మత్స్యకారులు రోడ్డు ఎందుకు ఎక్కారు? సముద్రంలో ఏం జరుగుతోంది? ఫార్మా వ్యర్థాల వల్ల జరుగుతున్న డ్యామేజీ ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ విశాలమైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రం.. మత్స్య సంపదకు తిరుగులేని ప్రాంతం.. కోస్తాతీరంలో లక్షలాది మందికి బతుకినిచ్చే సముద్రం..
కాలుష్యం కోరల్లో చిక్కి.. మత్స్యకారులకు ఇబ్బందిగా మారింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఉప్పాడ తీరప్రాంతం.. సాక్షాత్తు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి .. ఆ సమస్యను పరిష్కరిస్తానని.. అందుకు తనకు 100 రోజుల సమయం కావాలని అడిగాడు.. ఇంతకీ అక్కడున్న
సమస్య ఏమిటి.. ఆ తీరంలో మత్స్యకారుల ఆందోళనలకు కారణం ఏమిటి.. సముద్ర తీర ప్రాంతాన్ని కబలిస్తున్నది ఎవరు.. ఇత్యాది అంశాలపై
సముద్రం జీవ వైవిద్యానికి పెట్టింది పేరు. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషించే సముద్రంలోకి ఈ మధ్య కాలంలో పలు పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధాల కారణంగా సముద్రం కాలుష్యం కోరలలో చిక్కుకుంది. ఈ కాలుష్యం కారణంగా సముద్రంలో జీవించే వివిధ రకాల చేపలు పలు జీవరాశులు చనిపోతున్నాయి, దాంతో పాటు వాటి సంతతి కూడా వృద్ది చెందడం లేదు. దీని కారణంగా సముద్రం మీది ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులకు ఉపాధి కరువైంది. కాకినాడ జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలైన ఉప్పాడ, తొండంగి మండలాల్లో ఈ కాలుష్యం మరీ ఎక్కువగా ఉందని వేటకు వెళ్లినా చేపలు పడటం లేదని.. వేట ఆధారంగా జీవించే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు స్థానిక మత్స్యకారులు
కాలుష్యం కారణంగా ఈ చుట్టు పక్కల 20 కిలోమీటర్ల మేరకు ఎక్కడ వేటకి వెళ్లినా చేపలు చిక్కకపోవడంతో కనీసం బోటు డీజిల్ ఖర్చులు కూడా రావటం లేదంటూ వాపోతున్నారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కుటుంబ జీవనం సాగించడానికి తమ కుటుంబంలో మహిళలు స్థానికంగా ఉండే రొయ్యల ఫ్యాక్టరీలో పనిలోకి వెళ్తుంటే ఆ సంపాదన ద్వారా జీవిస్తున్నామంటూ ఆవేదన చెందుతున్నారు.
అరబిందో ఫార్మా, లైఫ్ ఎస్ ఫార్మా ఇవి దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీలు.. ఈ ఫార్మా కంపెనీలో పలు రకాలు మెడిసిన్స్ తో పాటు.. ఫార్మా పరిశ్రమలకు ఉపయోగపడే ముడి సరుకులు తయారు చేస్తూ ఉంటాయి.. ఈ తయారీ సమయంలో ఉపయోగించే వివిధ పదార్థాల నుంచి వచ్చే కాలుష్యం వ్యర్ధాలు బయటకు వస్తూ ఉంటాయి. అయితే నిబంధనల ప్రకారం ఈ కాలుష్య వ్యర్ధాలను పలు దపాలుగా శుద్ధిచేసి వాటిని ల్యాబ్స్ లో టెస్ట్ చేసి వాటిలో ఎటువంటి హానికరమైన పదార్థాలు వ్యర్ధాలు లేవని నిర్ధారించుకుని ఆ తర్వాత మాత్రమే పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలాలి. అలా వదిలితే సముద్రంలోని మత్స్య సంపదకు ఎటువంటి హాని జరగదు. కానీ ఈ ప్రాంతంలో స్థానికంగా నెలకొల్పిన ఫార్మా కంపెనీలు ఆ విధంగా వ్యవహరించటం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ప్రొడక్షన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో క్రమేపి సముద్రంలో చేపలు చనిపోతున్నాయని.. ఒకవేళ ఈ ఫార్మా కంపెనీలో సముద్రంలోకి పైపులైన్ ద్వారా వదిలే వ్యర్ధాలులో ఏటువంటి హానికరమైనవి లేకపోతే చేపలు ఎందుకు చనిపోతున్నాయంటూ మత్స్యకారుల ప్రశ్నిస్తున్నారు.. అలాగే రాత్రి సమయంలో ఎక్కువగా పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి కాలుష్య వ్యర్ధాలను వదులుతున్నారని ఆ సమయంలో విపరీతమైన వాసన వస్తు ఉంటుందని సముద్రంలో ఆ చుట్టుపక్కలంతా నీరు మురికిగా మారుతుందంటున్నారు. ఆ కారణం చేత ఈ చుట్టుపక్కల ఎక్కడ చేపలు చనిపోతున్నాయని ఈ ప్రాంతంలో చేపలు సంచరించడం లేదని ఆరోపిస్తున్నారు.
మత్స్యకారులు ఆరోపిస్తున్న.. 10 కి.మీ దూరంలోని సముద్రతీర ప్రాంతానికి హెచ్ఎం టీవీ బృందం వెళ్లి.. ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. నిగ్గు తేల్చే పనిలో భాగంగా ఆ ప్రాంతాన్ని ప్రజలకు చూపే ప్రయత్నం చేసింది. ఫార్మా కంపెనీలు సముద్రం మధ్యలో వేస్ట్ వాటర్ వదలడానికి వేసిన పైప్ లైన్ పరిశీలించడానికి ఆ ప్రాంతం ఏ విధంగా ఉందో పబ్లిక్ తెలియజేయడానికి హెచ్ఎం టీవీ బృందం బోటులో చేరుకుంది.
మత్స్యకారుల ఆరోపిస్తున్నట్టు మత్స్యకార సంపద క్రమేపీ తగ్గుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మత్స్యకారులు ఇంత నిరసన తెలియజేసి ఇంత వివాదం జరిగి ఆ శాఖకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చేంతవరకు కూడా పొల్యూషన్ బోర్డ్ అధికారులు ఎందుకు ఈ కాలుష్యాన్ని గమనించ లేకపోయారని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు పొల్యూషన్ బోర్డ్ అధికారులు ఈ కంపెనీ వైపు కన్నెత్తి చూడకపోవడం గల కారణం ఏమిటి.. కంపెనీ యజమాన్యంతో కొంతమంది పొల్యూషన్ బోర్డ్ ఉన్నతాధికారులకు ఏమైనా లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మత్స్యకారుల ఆరోపిస్తున్నట్టు సముద్రంలో వదులుతున్న వ్యర్ధాలపై పొల్యూషన్ బోర్డు అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టి ఎటువంటి ఒత్తిళ్లకు.. ప్రలోభాలకి గురి కాకుండా నిజాయితీగా వ్యవహరించాలని స్థానిక మత్స్యకారులు కోరుకుంటున్నారు.
ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టిసారించి ఇది కేవలం ఇది మత్స్యకారుల సమస్యగా భావించకుండా ప్రకృతికి హానికరంగా భావించి సముద్రంలో జరిగే ఈ కాలుష్యం కారణంగా వచ్చే దుష్ప్రభావాలు జీవ వైవిద్యానికి పెను ముప్పుగా పరిగణించాలి.. ఆ ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న వ్యర్ధాలను శుద్ధిచేసి నిరంతరం పొల్యూషన్ బోర్డ్ అధికారులు తనిఖీ అనంతరం మాత్రమే సముద్రంలోకి వదిలేలాగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.. అలాగే ఫార్మా కంపెనీలు కూడా ఆధునిక టెక్నాలజీని వినియోగించి వ్యర్ధాలను ఇతర వాటికి వినియోగించి కాలుష్యం తగ్గే విధంగా చర్యలు తీసుకుంటే ఈ సమస్యకు కొంతమేరకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. దాంతోపాటు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న మత్స్యకార కుటుంబాలకు కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఓఎన్జేసీ ఇస్తున్న ప్యాకేజ్ తరహాలో కుటుంబానికి 11వేల రూపాయలు నగదు ప్రతినెలా జమ చేస్తున్న విధంగా ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకురావాలని స్థానిక మత్స్యకార కుటుంబాలు కోరుతున్నాయి. మరోవైపు 100 రోజుల్లో ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ సమస్య ఎలాంటి పరిష్కారం ఇస్తారో.. అవి స్థానికులకు ఏ మేరకు మేలు చేస్తాయో.. వేచిచూడాలి

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire