విజయవాడలో విషాదం: విధుల్లో ఉన్న పీజీ వైద్యురాలి అనుమానాస్పద మృతి.. చేతిపై ఇంజెక్షన్ గుర్తులు!

విజయవాడ: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో విషాదం చోటుచేసుకుంది. అనస్థీషియా విభాగంలో పీజీ చివరి సంవత్సరం చదువుతున్న దీపిక (25) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
విజయవాడ: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో విషాదం చోటుచేసుకుంది. అనస్థీషియా విభాగంలో పీజీ చివరి సంవత్సరం చదువుతున్న దీపిక (25) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అర్థరాత్రి వరకు విధుల్లో చురుగ్గా ఉన్న విద్యార్థిని, కేవలం అరగంట వ్యవధిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే?
అనంతపురం జిల్లా కోవూరునగర్కు చెందిన కోదండరామిరెడ్డి, భారతి దంపతుల చిన్న కుమార్తె దీపిక. తిరుపతిలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. బుధవారం రాత్రి మరో తోటి విద్యార్థినితో కలిసి ఆమె ఆపరేషన్ థియేటర్ (OT) వద్ద విధుల్లో ఉన్నారు.
రాత్రి 11 గంటల సమయంలో తోటి వైద్యురాలితో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో వాంతులు వస్తున్నట్లు అనిపించడంతో, తోటి వైద్యురాలి సూచన మేరకు ఒక ఇంజెక్షన్ తీసుకున్నారు. అనంతరం మరో సర్జరీ ఉండటంతో దీపిక ఓటీ వద్దే ఉండిపోయారు. రాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన తోటి సిబ్బంది, వెంటనే సీపీఆర్ (CPR) చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
చేతిపై ఇంజెక్షన్ గుర్తులు.. పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీపిక చేతిపై నాలుగు ఇంజెక్షన్ గుర్తులు ఉండటం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. అవి సాధారణ మందుల గుర్తులా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
మరో నాలుగు నెలల్లో చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుందనుకున్న కుమార్తె, ఇలా శవమై కనిపించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. "పెళ్లి కూతురుగా చూడాలనుకున్న బిడ్డను ఇలా చూస్తామనుకోలేదు" అంటూ వారు ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



