ప్రకాశం బరాజ్ గేట్లను ఢీకొట్టిన ఆ బోట్లు ఎవరివి? దీని వెనుక కుట్ర ఉందా?

Whose boats hit the gates of Prakasam Barrage? Is there a conspiracy behind this?
x

ప్రకాశం బరాజ్ గేట్లను ఢీకొట్టిన ఆ బోట్లు ఎవరివి? దీని వెనుక కుట్ర ఉందా?

Highlights

బరాజ్‌ను డామేజ్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కృష్ణానదిలోకి బోట్లను వదిలారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.

విజయవాడ ప్రకాశం బరాజ్‌ వైపు అయిదు పడవలు కొట్టుకొచ్చిన ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. వీటిలో మూడు పెద్ద పడవలు బరాజ్ గేట్లను ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని స్వయంగా ముఖ్యమంత్రే ఆరోపించారు.

దీనిపై రాష్ట్ర జలవనరుల విభాగం – డబ్ల్యు.ఆర్.డి అధికారులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే, కుక్కల గడ్డకు చెందిన వక్కల గడ్డ ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

బరాజ్‌ను డామేజ్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కృష్ణానదిలోకి బోట్లను వదిలారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇది సైకో పన్నిన భారీ కుట్ర అని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ఇష్యూను డైవర్ట్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వైసీపీ అంటోంది.

అసలేం జరిగింది?

విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రకాశం బరాజ్ ప్రమాదకరంగా మారింది. సెప్టెంబర్ 1 ఆదివారం నాడు వరదలో అయిదు పడవలు బరాజ్ వైపు కొట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి గేటు దాటి బయట పడిందని చెబుతున్నారు మరొకటి నీట మునిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే, మిగతా మూడు భారీ పడవలు నేరుగా బరాజ్ గేట్లను ఢీకొన్నాయి. దాంతో, బరాజ్ కు చెందిన 67, 69, 70 గేట్లకు ఉన్న 17 టన్నుల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి.

అయితే, ఈ బోట్ల కోసం యజమానులు ఎవరూ రాకపోవడంతో అధికారులకు అనుమానాలు వచ్చాయి. డబ్ల్యు.ఆర్.డి అధికారులు వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉషాద్రి, కోమటి రామ్మోహన్ లను అరెస్టు చేశారు.

గొల్లపూడి వైపు బోట్లు ఎందుకు వచ్చాయి?

ప్రకాశం బరాజ్ ను ఢీ కొట్టిన మూడు బోట్లు చాలా పెద్దవి. ఒక్కో బోటు బరువు 30 నుంచి 40 టన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తవ్వి లారీలో నింపేందుకు వీటిని ఉపయోగిస్తారు.

ఈ బోట్లు గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం వైపు ఉండేవి. అయితే, వరదలకు కొన్ని రోజుల ముందే వీటిని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చారు. అలా ఎందుకు తెచ్చారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పడవలకు లంగరు వేయడంలో నిర్లక్ష్యమా?

పడవలకు లంగరు వేసే విషయంలో ఎవరైనా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. భారీ వర్షాలతో కృష్ణా నదికి వరదలు ముంచెత్తే అవకాశం ఉందనే హెచ్చరికలు వచ్చినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పడవలు కొట్టుకుపోకుండా ఒక్కో పడవకు ప్రత్యేకంగా లంగరు గట్టిగా కట్టాలి. కానీ, ఈ పడవలకు లంగరు వేయలేదు. వాటిని కేవలం ఒక ప్లాస్టిక్ తాడుతో కలిపి కట్టారని అధికారులు గుర్తించారు.

వరద పోటెత్తినప్పుడు కృష్ణానదికి ఇరువైపులా ఒడ్డు మీద పక్కగా లంగరు వేసిన బోట్లు సురక్షితంగానే ఉన్నాయి. కానీ, ఈ పడవలు మాత్రమే ఎందుకు కొట్టుకువచ్చాయన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. పైగా, ఈ పడవలు చాలా ఖరీదైనవి. ఒక్కో పడవ విలువ 50 లక్షల పైనే ఉంటుంది. అలాంటి బోట్ల గురించి యజమానులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ప్రకాశం బరాజ్‌ను దెబ్బ తీసే కుట్ర జరిగిందా?

ప్రకాశం బరాజ్ ను దెబ్బతీయాలనే కుట్ర ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం కు బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ అత్యంత సన్నిహితుడని చెప్పారు. కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. అక్రమ ఇసుక వ్యాపారం చేసే పడవల్ని ప్రాజెక్టుకు నష్టం కల్గించేందుకు వాడారని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వం బుడమేరు గండ్లను పూడిస్తే ఈ పరిస్థితి వచ్చేదికాదని ఆయన చెప్పారు.

టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ వార్


ప్రకాశం బరాజ్ గేట్లను బోట్లు ఢీకొన్న అంశంపై రాజకీయంగా టీడీపీ , వైఎస్ఆర్సీపీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.దీని వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ బోట్లు వైఎస్ఆర్సీపీకి చెందినవారివని ఆపార్టీ అంటోంది.

వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. కోమటి రామ్మోహన్ మంత్రి నారా లోకేష్ తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. పబ్లిసిటీ పిచ్చిలో టీడీపీ అధినేత బాధితుల్ని గాలికి వదిలేశారని, వరద బాధితుల ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది.

డామేజీ ఏ స్థాయిలో ఉంది?

వరదల్లో బోట్లు వచ్చి డీకొనడంతో మూడు గేట్లకున్న కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వాటిని వెంటనే రిపేర్ చేయించింది.

ఈ బోట్లు కనుక బరాజ్ పిల్లర్లకు తగిలి ఉంటే ఏమై ఉండేదని కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కుట్ర కోణాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మున్ముందు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విషయాలు బయట పెడతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories