Women Voters: ఆంధ్రప్రదేశ్‌లో అతివలదే పైచేయి.. పురుష ఓటర్ల సంఖ్యను దాటేసిన మహిళలు

Women Voters Outnumber Men in Andhra Pradesh
x

Women Voters: ఆంధ్రప్రదేశ్‌లో అతివలదే పైచేయి.. పురుష ఓటర్ల సంఖ్యను దాటేసిన మహిళలు

Highlights

Women Voters: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. ఒకరు సిద్ధమంటే....మరొకరు సంసిద్ధమంటున్నారు.

Women Voters: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. ఒకరు సిద్ధమంటే....మరొకరు సంసిద్ధమంటున్నారు. ప్రజల వద్దకే పాలన తెస్తామంటుంది ఒక పార్టీ. ప్రజా పాలన అందిస్తామంటోంది మరో పార్టీ. ఆదరించి అధికారమిస్తే... అద్బుతాలు చేస్తామంటూ ఊదరగొడుతున్నారు నేతలందరూ... ఇలా ఓటర్లను ఆకట్టుకునేందుకు అధినేతలు వరాల వర్షం కురిపిస్తున్నారు. నాయకుల మాటల తూటాలకు ఓట్లు రాలుతాయో లేదో కానీ... మగువల మనసును గెలుచుకంటేనే విజయం సిద్దిస్తుందన్నది మాత్రం అక్షర సత్యం.

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుంది. అధినేతల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. మ్యానిఫెస్టోలు ప్రకటించిన పార్టీలు ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. ఈ సారి రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. దీంతో గెలుపు ఓటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లే ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన గత ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 2 కోట్ల,74వేల 322 ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 2 కోట్ల 3 లక్షల, 39 వేల 851కి చేరింది. మహిళా ఓటర్లు 2 కోట్ల 7లక్షల ,29వేల 452 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2 కోట్ల 10లక్షల 58వేల 615కి చేరింది. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపు 7లక్షల 18వేల 764 మంది ఎక్కువగా ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య గతంలో 3 వేల 482 ఉండగా ఇప్పుడు 3 వేల 421గా నమోదైంది. సర్వీసు ఓటర్లు 67వేల 434 ఉండగా ఇప్పుడు 68వేల 185కు చేరింది. గతంలో కన్నా సర్వీసు ఓటర్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాల్లో 20లక్షల 56వేల 203 ఓటర్లతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది.

రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే.. అందులో 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని మహిళా ఓటర్లే నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో...వారి ఓటు బ్యాంక్‌పై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. అందుకు అనుగునంగానే పార్టీలు సైతం తమ మ్యానిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. వైసీపీ నవరత్నాలు అంటే.., టీడీపీ సూపర్‌ సిక్స్‌ అంటూ తమ మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశాయి. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ నేనేమి తక్కువనా అన్నట్లు మహిళల కోసం కొత్త పథకాలను ప్రకటించింది. దీంతో ఇప్పుడు మహిళలు ఏ పార్టీకీ మద్దతు ఇస్తారన్నది కీలకంగా మారింది. సంక్షేమ పథకాలే కేంద్రంగా సాగుతున్న ఈ ఎన్నికల సమరంలో మహిళా ఓటర్లు ఎవర్ని అధికారంలోకి తీసుకోస్తారన్నదే ప్రధాన చర్చగా మారింది.

కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో విడుదల చేసిన తుది జాబితాలో శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో, పురుష ఓటర్లు.. మహిళా ఓటర్ల కన్నా ఎక్కువగా ఉండగా తాజాగా విడుదల చేసిన జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇంకా 21 నియోజకవర్గాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.. టెక్కలి, పాతపట్నం, అమదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, చీపురుపల్లి, గాజువాక, పిఠాపురం, పి.గన్నవరం, ఎర్రగొండపాలెం. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పత్తికొండ, కోడుమూరు ఆలూరు, మడకశిర, దర్శి, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యత కొనసాగుతోంది.

ఈ సారి ఎన్నికలను అటు అధికార పార్టీ, ఇటూ ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉంటడంతో వారు ఏ పార్టీక మద్దతుగా నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీలు ఎంత ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా....ఎన్ని హామీలు కుమ్మరించినా వాటిని మహిళలు మెచ్చాలి. ఏ పార్టీ మహిళా ఓటర్లను ఆకట్టుకుంటుందో ఆ పార్టే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మహిళా మహారాణులు ఏ పార్టికి అండగా ఉంటారు...ఏ పార్టీకి తోడు, నీడగా నిలిచి అధికారంలోకి తీసుకొస్తారన్నది తేలాలంటే...జూన్ 4వ తేదీ వరకు వేసి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories