Ugadi 2025 Aquarius Horoscope: కుంభ రాశివారికి అద్భుత లాభాలు.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త..

Ugadi 2025 Aquarius Horoscope
x

Ugadi 2025 Aquarius Horoscope: కుంభ రాశివారికి అద్భుత లాభాలు.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త..

Highlights

Ugadi 2025 Aquarius Horoscope: గోచార గ్రహాల స్థితి, గతుల రీత్యా, ఓమోస్తరులో శుభ ఫలితాలే లభిస్తాయి. అన్ని వ్యవహారాల్లోనూ స్థిరచిత్తం, సానుకూల దృక్పథంతో సాగాలి.

ఆదాయం 8

వ్యయం 14

రాజపూజ్యత 7

అవమానం 5

Ugadi 2025 Aquarius Horoscope: గోచార గ్రహాల స్థితి, గతుల రీత్యా, ఓమోస్తరులో శుభ ఫలితాలే లభిస్తాయి. అన్ని వ్యవహారాల్లోనూ స్థిరచిత్తం, సానుకూల దృక్పథంతో సాగాలి. ప్రతి పనినీ పలు రకాలుగా ఆలోచించి ప్రయత్నించాలి. ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక అవసరాలకు అప్పులూ చేయాల్సి రావచ్చు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. అన్నింటా ముందుచూపు చాలా అవసరం. ఈ రాశివారికి కార్యసాధనలో.. శారీరక, మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి కార్యంలోనూ ఆత్మవిశ్వాసం అవసరం. అలాగని, అతివిశ్వాసం, దురాలోచన ఏమాత్రం మంచిది కాదు. వస్తు, వాహన, గృహ భూమి లాభాలుంటాయి. వివాహాది శుభకార్యాలు నెరవేరతాయి.

జీవిత భాగస్వామితో అనుకోని కలహాలు ఎదురైనా, సంసార జీవితంపై ఏమంత ప్రభావం చూపవు. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. సత్సంబంధాలు నెలకొంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాలకు విహారయాత్రలు చేస్తారు. నూతన పరిచయాలు కలతలకు కారణమయ్యే సూచన ఉంది.

ఈ రాశివారు, మాట నిలుపుకోలేక అవమానపడే వీలుంది. కాబట్టి, వీలైనంత వరకు ఎవరికీ పూచీగా ఉండకండి. ప్రాణ స్నేహితులే అయినా, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వద్దు. ఆరోగ్యంపై తగిన జాగ్రత్త అవసరం.

వృత్తి, ఉద్యోగ, జీవనోపాధి వ్యవహారాల్లో తొందరపాటు ఏమాత్రం మంచిది కాదు. ఒత్తిడి, భయాందోళనలు, వ్యతిరేక మనోభావాలు, నిరాశ, నిస్పృహ ఏర్పడినా.. స్థిర చిత్తంతో పనిచేస్తే.. సత్ఫలితాలే లభిస్తాయి. చేతివృత్తులు, కులవృత్తులను కొనసాగించే వారికి కాస్తంత అనుకూలంగానే ఉన్నా, బద్ధకం, నిర్లక్ష్య ధోరణి కారణంగా చక్కటి అవకాశాలను దూరం చేసుకుంటారు. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు కాస్త మెరుగ్గా ఉంటుంది. ఆశించిన రివార్డులు, అనుకున్న చోటికి బదిలీలు లభిస్తాయి. అయితే, వ్యర్థ మాటల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పై అధికారులతో అనుకూలంగా లేకుంటే అనుకోని చక్కుల్లో పడేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు ఆశాజనంగానే ఉంటాయి.

వ్యాపారులు ఈ ఏడాది లాభాలను అందుకుంటారు. వీలైనంత మేర భాగస్వామ్య వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఇప్పటికే భాగస్వామ్య వ్యాపారాలు నడిపేవారు, పరిధిని దాటకండి. చెప్పుడు మాటలతో మనసును విరిచి, లబ్ది పొందాలనుకునేవారు ఎక్కువగా ఉంటారు. తెలివిగా వ్యవహరించండి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. వ్యాపార విస్తరణ, నూతన వ్యాపార యత్నాలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఒకవేళ తప్పనిసరై వ్యాపారం ప్రారంభించాల్సి వచ్చినా, సామర్థ్యాన్ని మించి పెట్టుబడి పెట్టకండి. ముఖ్యంగా అప్పు చేసి వ్యాపారం ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ఎగుమతి, దిగుమతుల వ్యవహారాల్లో చిక్కులుంటాయి.

రాజకీయ రంగంలోని వారు ఓపికగా వ్యవహరించాలి. దుందుడుకు చర్యల వల్ల చిక్కుల్లో పడతారు. ఆశించిన పదవి లభించినా, దాన్ని సమర్థంగా నిర్వహించడంలో ఒడుదుడుకులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆశించిన స్థాయిలో కాకున్నా, ఓమోస్తరు లాభాలను చూస్తారు.

విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. లక్ష్యసాధనకు బాగా ఎక్కువగా కష్టపడాలి. ర్యాంకులపై ఆశ ఉన్నా, దానికి తగ్గ కృషి లేకపోవడం వల్ల నిరాశ తప్పదు. విదేశీ విద్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దళారుల వల్ల మోసపోయే సూచన ఉంది. నిరుద్యోగులు విసుగు చెందకుండా అవకాశం చిన్నదైనా అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి.

కుంభ రాశి వారు, ఈ సంవత్సరమంతా.. నిత్యం శివనామస్మరణ చేయడం, శివాలయాన్ని దర్శించడం మంచిది. దుర్గా సప్తశతి పారాయణం, రుద్రాభిభిషేకం మేలు చేస్తాయి. నవగ్రహారాధన శుభ ఫలితాలనిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories