Ugadi 2025 Scorpio Horoscope: శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది రాశిఫలాలు.. వృశ్చిక రాశివారి సంపూర్ణ జాతకం..

Ugadi 2025 Scorpio Horoscope
x

Ugadi 2025 Scorpio Horoscope: శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది రాశిఫలాలు.. వృశ్చిక రాశివారి సంపూర్ణ జాతకం..

Highlights

Ugadi 2025 Scorpio Horoscope: ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికీ సామాన్యంగానే ఉంటుంది. ఆలస్యంగా అయినా, ఆశించిన ఫలితాలు మాత్రం దక్కుతాయి.

ఆదాయం -2

వ్యయం- 14

రాజపూజ్యత- 5

అవమానం-2

Ugadi 2025 Scorpio Horoscope: ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికీ సామాన్యంగానే ఉంటుంది. ఆలస్యంగా అయినా, ఆశించిన ఫలితాలు మాత్రం దక్కుతాయి. గత సంవత్సరం కంటే కొంత ఉత్సాహకరంగా ఉంటుంది. ప్రయత్నాలను సఫలం చేసుకునేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపడి మాట్లాడడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, మొండి పట్టుదలకు పోవడం వల్ల నష్టపోతారు. అవసరానికి తగ్గట్లుగా పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఈ సంవత్సరం, ఈరాశి జాతకులను, ఎదుటి వారు అపార్థం చేసుకునే సందర్భాలు బాగా ఎక్కువగా ఉంటాయి.

ఆర్థిక వ్యవహారాలు ఏ ఇబ్బందీ లేకుండా సజావుగానే సాగుతాయి. అవసరానికి తగిన డబ్బు సర్దుబాటు అవుతుంటుంది. ఖర్చు విషయంలో ప్రణాళిక లేకపోతే, మొదటికే మోసం వచ్చే వీలుంది. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. మితిమీరిన అప్పులు కూడా మంచిది కాదు. పంతం కారణంగానో, ఆత్మీయుడని భావించో.. ఎవరికీ పూచీలను ఇవ్వకండి. వారి రుణభారం మీరు మోయాల్సి వస్తుంది. కుటుంబంలో అనవసరమైన ఆందోళన తలెత్తుతుంది. జీవిత భాగస్వామి తరఫు వారితోను, తల్లి తరపు బంధువులతోను సంయమంనంతో వ్యవహరించాలి. వివాహాది శుభకార్యాల పూర్తికి బాగా ఇబ్బంది పడతారు. నమ్మిన వ్యక్తులు అత్యవసర సమయంలో ముఖం చాటేయడం వల్ల సమస్యలొస్తాయి. భూ, వస్తు, వాహనాదుల కొనుగోలు యత్నాలు బాగా నెమ్మదిస్తాయి. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఒత్తిళ్లుంటాయి. బాధ్యతల నిర్వహణలో అలసత్వం, బద్ధకం కారణంగా ఉన్నతాధికారులతో మాట పడాల్సి వస్తుంది. పైఅధికారుల వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగ స్థిరత్వంపై భయాందోళనలు కలుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వారికి ఆశించిన బదిలీలు, ప్రమోషన్లు, ఇక్రిమెంట్లు అంత తేలిగ్గా లభించవు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులకై ప్రయత్నించకుండా బాధ్యతగా సాగడమే మంచిది. విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలూ ఏమంత ఆశాజనకంగా ఉండవు.

వ్యాపారులకు సామాన్య ఫలాలే ఉంటాయి. వ్యాపారం తగ్గుముఖం పట్టి, ఆశించిన స్థాయి లాభాలు లభించక ఆందోళనకు గురవుతారు. వ్యాపార విస్తరణకు కొన్ని అడ్డంకులు ఎదురైనా, అతి కష్టమ్మీద గట్టెక్కుతారు. వీలైనంత వరకు, కొత్త వ్యాపారాల ప్రారంభం, వ్యాపార విస్తరణ యత్నాలను విరమించుకుంటే మంచిది. వృత్తిపరమైన వ్యాపారాలు, కులవృత్తులపై ఆధారపడిన వ్యాపారాలు చేసేవారికి ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. అయితే, సమాయానికి వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో వెనుకబడడం వల్ల ఇబ్బంది పడతారు.

రాజకీయ రంగంలోని వారు విపరీతమైన ఒడుదుడుకులను ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు బలంగా తయారవుతారు. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోతారు. ఎన్నికలు, పోటీల్లో తొందరపాటు మంచిది కాదు. మెరుగైన అవకాశం వచ్చే వరకూ ఓపికగా ఉండాలి.

విద్యార్థులు పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలి. పోటీ పరీక్షలపై దృష్టిని సారించి, ఏకాగ్రతతో చదివినా ఆశించిన స్థాయి ఫలితాలు అందవు. నిర్లక్ష్యంగా, బద్ధకంతో వ్యవహరిస్తే, అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల దిశానిర్దేశంలో అనుకూల దృక్పథంతో సాగితే, కాస్త మెరుగైన ఫలితాలను పొందుతారు. విదేశీ విద్యాయత్నాలను విరమించుకుంటే మంచిది.

ఈరాశి వారు గురువులు, అవధూతలను ఆరాధించడం, విష్ణు సంబంధ క్షేత్రాలను దర్శించడం వల్ల మేలు కలుగుతుంది. అడపాదడపా శివుడికి అభిషేకం, రుద్రకవచ పారాయణ వల్ల కూడా శుభ ఫలితాన్ని పొందగలుగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories