Ugadi 2025 Virgo Horoscope: ఉగాది రాశిఫలాలు 2025-26.. కన్య రాశికి కలిసొచ్చే కాలం..

Ugadi 2025 Virgo Horoscope
x

Ugadi 2025: ఉగాది రాశిఫలాలు 2025-26.. కన్య రాశికి కలిసొచ్చే కాలం..

Highlights

Ugadi 2025 Virgo Horoscope: ఈరాశి వారికి విశ్వావసు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలే అందుతాయి. ప్రతి పనినీ పట్టుదలతో సాధించుకోవాలి. ఆరోగ్య సమస్యలు, ఊహించని ఖర్చులు వంటివి తరచూ ఎదురవుతాయి.

ఆదాయం-14

వ్యయం- 2

రాజపూజ్యత- 6

అవమానం- 6

Ugadi 2025 Virgo Horoscope: ఈరాశి వారికి విశ్వావసు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలే అందుతాయి. ప్రతి పనినీ పట్టుదలతో సాధించుకోవాలి. ఆరోగ్య సమస్యలు, ఊహించని ఖర్చులు వంటివి తరచూ ఎదురవుతాయి. గృహమార్పు, ప్రాంత మార్పు వంటివి కొందరికి తప్పేలా లేవు. ప్రతి విషయంలోనూ కొత్త కోణాలను అన్వేషిస్తూ, లక్ష్య సాధనవైపు సాగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వారసత్వపు ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వచ్చే వీలుంది. అనవసర పంతాలు, పట్టుదలలకు పోయి ఇరుకున పడే సూచన ఉంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వ్దదు. అనవసరమైన ఖర్చులు, తప్పనిసరి ప్రయాణాలు ఉంటాయి. తల్లిదండ్రుల వైపు బంధువులతో సఖ్యత చెడుతుంది. మానసిక అశాంతి పెరుగుతుంది.

ఆర్థికంగా మిగులు లేకున్నా, రొటేషన్ మాత్రం బాగానే ఉంటుంది. అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం వల్ల చిక్కుల్లో పడతారు. పొరపాటున కూడా ఎవరికీ పూచీగా ఉండకండి. దీని వల్ల ఊహించని ఇబ్బందులు వస్తాయి. నమ్మినవారి చేతిలోనే మోసపోతారు. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ప్రతి పనిలోనూ స్వీయ పర్యవేక్షణ అవసరం. అన్నదమ్ములు, దాయాదులతో అనుకోని ఘటనలు, మనస్పర్థలు ఏర్పడతాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగే వీలుంది. కాబట్టి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, నోటిదురుసుతో వ్యవహరించడం మంచిది కాదు. స్నేహితులతో కూడా హద్దుల్లో ఉండడం శ్రేయస్కరం.

వివాహాది శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. బంధువులు సహకరిస్తారు. స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచన ఉంది. వస్తు, వాహన లాభముంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ప్రధానంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి కాస్తంత ఆశాజనకంగా ఉంటుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే వారికి ఆశించిన రీతిలోనే ప్రమోషన్లు లభిస్తాయి. అయితే మానసిక ఆందోళన, పని ఒత్తిడి బాగా పెరుగుతాయి. ప్రభుత్వోద్యుగులకు సామాన్య అనుకూలతలుంటాయి. బదిలీలు, ప్రమోషన్లు, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల్లో జాప్యం గోచరిస్తోంది. ఉన్నతాధికారులతో అనూహ్యమైన స్పర్థలు ఏర్పడే సూచనలున్నాయి. విదేశీ ఉద్యోగాలకు చేసే ప్రయత్నాలు మందకొడిగా ఉంటాయి.

వ్యాపారులు, భాగస్వామ్య వ్యవహారాలకు తగినంత దూరంగా ఉండడం మంచిది. పార్ట్‌నర్‌షిప్ వ్యాపారాలు అనుకూలించడం బాగా కష్టం. సొంతంగా వ్యాపారాలు నడిపే వారికి, రాబడి ఉన్నా, మిగులు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరమైన వ్యాపారాలు చేసే వారికి, కులవృత్తులను కొనసాగించే వారికి లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్ నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. రియల్టర్లు, స్పెక్యులేటర్లు, షేర్ మార్కెట్ రంగాలకు చెందిన వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించకుంటే, భారీగా నష్టపోయే సూచన ఉంది.

రాజకీయ రంగాల్లోని వారికి కాస్తంత గడ్డు కాలమనే చెప్పాలి. ఇంటా, బయటా గౌరవ భంగాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని పంతాలకు పోతే కెరీర్ పరంగా కోలుకోలేని దెబ్బ పడే అవకాశం ఉంది. అనవసరమైన చోట తగ్గుతూ.. అవసరమైన చోట చక్కటి ఎత్తులు వేసుకుంటే వెళితే, కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఉంటాయి.

విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం బాగా శ్రమించాల్సి వుంటుంది. ప్రణాళికల అమలులో అలసత్వం, వాయిదాలు వేయడం వల్ల ఆశించిన ర్యాంకులు లభించే అవకాశాలు ఉండవు. విదేశీ విద్యాప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది.

ఈరాశి వారు నిత్యం శివుణ్ణి దర్శిస్తూ, అర్చన, అభిషేకాలు చేయించడం వల్ల మేలు జరుగుతుంది. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది. మధ్యమధ్యలో నవగ్రహారాధనలూ చేయించుకోవడం శుభఫలితాలనిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories