
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే జేబు ఖాళీ అవ్వడం ఖాయం
Second Hand EV : భారతదేశంలో పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తుండటంతో సామాన్యుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. కొత్త ఈవీ స్కూటర్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉండటంతో, చాలా మంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పాత పెట్రోల్ స్కూటర్ కొనడానికి, పాత ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి మధ్య చాలా తేడా ఉంది. పెట్రోల్ ఇంజిన్ కండిషన్ చూడటం ఒకెత్తయితే, ఈవీలో ఉండే సెన్సిటివ్ పార్ట్స్ తనిఖీ చేయడం మరో ఎత్తు. మీరు కూడా తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మోసపోకుండా ఉండటానికి ఈ క్రింది విషయాలను ఖచ్చితంగా గమనించాలి.
బ్యాటరీ కండిషన్
ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీయే గుండెకాయ వంటిది. స్కూటర్ మొత్తం ధరలో దాదాపు 40 నుంచి 50 శాతం ఖర్చు బ్యాటరీకే అవుతుంది. అందుకే సెకండ్ హ్యాండ్ స్కూటర్ చూస్తున్నప్పుడు బ్యాటరీ ఎంత పాతదో అడిగి తెలుసుకోండి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత సమయం పడుతోంది? ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తోంది? అనేది టెస్ట్ చేయండి. బ్యాటరీ ప్యాక్ మీద లేదా ఛార్జింగ్ పోర్ట్ వద్ద తుప్పు పట్టినట్లు ఉన్నా, వైర్లు కట్ అయినట్లు అనిపించినా ఆ స్కూటర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. వీలైతే బ్యాటరీ హెల్త్ రిపోర్ట్ అడగండి.
మోటార్, వైరింగ్ వ్యవస్థ
స్కూటర్ కొనేముందు ఒకసారి టెస్ట్ రైడ్ వెళ్లడం మర్చిపోవద్దు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మోటార్ నుంచి ఏవైనా వింత శబ్దాలు వస్తున్నాయా? లేదా స్కూటర్ మధ్యమధ్యలో ఆగిపోతూ జెర్క్స్ ఇస్తుందా? అని గమనించండి. ఈవీలలో వైరింగ్ చాలా ముఖ్యం. సీటు కింద లేదా ఫుట్ బోర్డ్ కింద నీటి మరకలు ఉన్నాయేమో చూడండి. నీరు చేరడం వల్ల వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అధీకృత సర్వీస్ సెంటర్ నుంచి సర్వీస్ హిస్టరీని తీసుకుంటే, ఆ స్కూటర్‌ను గతంలో ఎలా వాడారో మీకు ఒక స్పష్టత వస్తుంది.
స్మార్ట్ ఫీచర్లు, డాక్యుమెంట్లు
నేటి కాలంలో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు టచ్ డిస్‌ప్లే, మొబైల్ యాప్ కనెక్టివిటీతో వస్తున్నాయి. డిస్‌ప్లేలో ఏవైనా ఎర్రర్ కోడ్స్ లేదా ఫాల్ట్ అలర్ట్స్ కనిపిస్తున్నాయేమో చెక్ చేయండి. కేవలం లోపల ఉండే భాగాలే కాకుండా టైర్లు, బ్రేక్ ప్యాడ్లు, లైట్ల కండిషన్ కూడా చూడాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా స్కూటర్ రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు ఒరిజినల్‌వా కాదా అని సరిచూసుకోండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ హిస్టరీ చూస్తే ఆ వాహనానికి గతంలో ఏవైనా ప్రమాదాలు జరిగాయేమో తెలిసిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మీ సెకండ్ హ్యాండ్ ఈవీ కొనుగోలు లాభసాటిగా ఉంటుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




