
మారుతీ సామ్రాజ్యం బీటలు వారుతోందా? చతికిలబడ్డ బెస్ట్ సెల్లింగ్ కార్లు
Maruti Suzuki Sales : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జనవరి 2026 విక్రయాల్లో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన బడ్జెట్ కార్ల అమ్మకాలు భారీగా పడిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కస్టమర్ల అభిరుచి మారడం మరియు ఎస్‌యూవీల క్రేజ్ పెరగడంతో మారుతీకి చెందిన ఐకానిక్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు వెనుకబడిపోయాయి. జనవరి 2026 గణాంకాల ప్రకారం..మారుతీకి వెన్నెముకలాంటి వ్యాగన్ ఆర్ అమ్మకాలు ఏకంగా 37 శాతం పడిపోయాయి. గతంలో నెలకు 20 వేలకు పైగా అమ్ముడయ్యే ఈ కారు, ఇప్పుడు 15,118 యూనిట్లకే పరిమితమైంది. అదేవిధంగా, డిసెంబర్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న బాలెనో అమ్మకాలు 16 శాతం తగ్గి ఐదో స్థానానికి పడిపోయింది. ఫ్రాంక్స్ 12 శాతం, గ్రాండ్ విటారా ఏకంగా 55 శాతం మేర అమ్మకాల్లో క్షీణతను చూశాయి. సెలెరియో, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి.
చిన్న కార్ల పరిస్థితి ఇలా ఉంటే ఎస్‌యూవీలు, పెద్ద వాహనాలు మాత్రం మారుతీని ఆదుకున్నాయి. కొత్తగా వచ్చిన మారుతీ విక్టోరిస్ అనూహ్యంగా పుంజుకుంది. దీని అమ్మకాలు గత నెలతో పోలిస్తే 145 శాతం పెరిగి 15,240 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక బడ్జెట్ ఎస్‌యూవీ బ్రెజ్జా 19 శాతం వృద్ధితో 17,486 యూనిట్ల విక్రయాలను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న జిమ్నీ అమ్మకాల్లో ఏకంగా 263 శాతం పెరుగుదల కనిపించడం విశేషం.
సెడాన్ కార్ల క్రేజ్ తగ్గిందని అందరూ అనుకుంటున్న తరుణంలో మారుతీ డిజైర్ దుమ్ము రేపుతోంది. జనవరిలో 19,629 యూనిట్లతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా నిలిచింది. దీని అమ్మకాలు గతేడాది కంటే 28 శాతం పెరిగాయి. ఫ్యామిలీ ఎంపీవీ ఎర్టిగా కూడా 17,892 యూనిట్ల విక్రయాలతో తన హవాను కొనసాగిస్తోంది. ఈ కార్ల పుణ్యమా అని మారుతీ సుజుకీ మార్కెట్ వాటా 38.6 శాతంతో స్థిరంగా ఉంది.
మారుతీ మేనేజ్‌మెంట్ ప్రకారం..చిన్న కార్ల ధరలు పెరగడం, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం ఒక కారణమైతే, యువత ఎక్కువగా ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపడం ప్రధాన కారణం. గతంలో 64 శాతంగా ఉన్న చిన్న కార్ల మార్కెట్ వాటా, ఇప్పుడు 35 శాతానికి పడిపోయింది. రాబోయే రోజుల్లో చిన్న కార్ల విభాగంలో కొత్త మోడళ్లు లేదా ధరల తగ్గింపు ఉంటేనే మళ్లీ పాత రోజులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




