Skoda Slavia : మళ్ళీ పెరిగిన కార్ల ధరలు..స్కోడా స్లావియా కొనాలంటే జేబుకు చిల్లే

Skoda Slavia : మళ్ళీ పెరిగిన కార్ల ధరలు..స్కోడా స్లావియా కొనాలంటే జేబుకు చిల్లే
x
Highlights

మళ్ళీ పెరిగిన కార్ల ధరలు..స్కోడా స్లావియా కొనాలంటే జేబుకు చిల్లే

Skoda Slavia : కొత్త కారు కొందామనుకునే మధ్యతరగతి వారికి షాకింగ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా తన పాపులర్ సెడాన్ స్లావియా ధరలను భారీగా పెంచేసింది. కొత్త ఏడాదిలో ఇప్పటికే కైలాక్ ధరలను పెంచిన కంపెనీ, ఇప్పుడు స్లావియాపై కూడా వడ్డన మొదలుపెట్టింది. వేరియంట్‌ను బట్టి ఈ పెంపు గరిష్టంగా రూ.33,690 వరకు ఉంది. దీంతో స్కోడా ప్రియుల బడ్జెట్ ఒక్కసారిగా తలకిందులైంది.

కొత్త ఏడాదిలో వాహనదారులపై ధరల భారం పెరుగుతూనే ఉంది. స్కోడా ఆటో ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ స్లావియా ధరలను సవరించింది. ఈ పెంపు ప్రభావం ముఖ్యంగా ఈ కారులోని హై-ఎండ్ వేరియంట్లపై ఎక్కువగా పడింది. స్లావియా పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన మరియు స్పోర్టియర్ లుక్ కలిగిన మోంటే కార్లో వేరియంట్లు ఇప్పుడు మరింత ప్రియం అయ్యాయి. స్లావియా మోంటే కార్లో 1.0 ఆటోమేటిక్ వేరియంట్ ధర గరిష్టంగా రూ.33,690 పెరగగా, 1.5 లీటర్ DSG మోంటే కార్లో వేరియంట్ ధర రూ.29,207 పెరిగింది.

ప్రీమియం లుక్ కోరుకునే వారు ఎంచుకునే ప్రెస్టీజ్, స్పోర్ట్‌లైన్ వేరియంట్లు కూడా ధరల పెంపు నుంచి తప్పించుకోలేకపోయాయి. ప్రెస్టీజ్ 1.0 ఆటోమేటిక్ ధర రూ.27,690, స్పోర్ట్‌లైన్ 1.5 DSG ధర రూ.25,897 పెరిగాయి. అలాగే ప్రెస్టీజ్ 1.5 DSG వేరియంట్‌పై రూ.23,207 భారం పడింది. 1.0 లీటర్ ఇంజిన్ కలిగిన సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్ వేరియంట్లపై సుమారు రూ.16,586 వరకు స్వల్పంగా ధరలు పెరిగాయి. అయితే, బేస్ మోడల్ అయిన క్లాసిక్ 1.0 మ్యాన్యువల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు, ఇది పాత ధరకే లభిస్తోంది.

ప్రస్తుతం ఈ ధరల సవరణ తర్వాత స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధరలు రూ.10 లక్షల నుంచి రూ.17.99 లక్షల మధ్య ఉన్నాయి. స్లావియా ప్రధానంగా రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకటి 1.0 లీటర్ TSI ఇంజిన్ (115 PS పవర్), మరొకటి పవర్‌ఫుల్ 1.5 లీటర్ TSI ఇంజిన్ (150 PS పవర్). ఈ కారు హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. తయారీ ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగానే ఈ ధరల పెంపు తప్పలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories