
TVS Motors Overtakes Yamaha
టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టూ-వీలర్ తయారీదారుగా అవతరించింది. 54.6 లక్షల యూనిట్ల విక్రయాలతో జపాన్ దిగ్గజం యమహాను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
TVS Motor : భారతీయ ఆటోమొబైల్ రంగం గ్లోబల్ మార్కెట్లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దేశీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమ్మకాల పరంగా జపాన్ దిగ్గజం యమహాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద టూ-వీలర్ తయారీదారుగా టీవీఎస్ అవతరించింది. 2025 క్యాలెండర్ ఇయర్లో టీవీఎస్ ఏకంగా 54.6 లక్షల (5.46 మిలియన్) యూనిట్లను విక్రయించి ఈ ఘనత సాధించింది. ఇదే సమయంలో యమహా 50 లక్షల యూనిట్లకు పరిమితమై నాల్గవ స్థానానికి పడిపోయింది.
టీవీఎస్ సాధించిన ఈ వృద్ధి రేటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 2024లో 45.2 లక్షల యూనిట్లు అమ్మిన ఈ కంపెనీ, ఏడాది కాలంలోనే 20.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు యమహా కేవలం 0.8 శాతం స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. ప్రపంచ టాప్-3 టూ-వీలర్ బ్రాండ్లలో చోటు దక్కించుకున్న రెండో భారతీయ కంపెనీ టీవీఎస్ కావడం విశేషం. ఇప్పటికే హీరో మోటోకార్ప్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, హోండా కంపెనీ 16.44 మిలియన్ యూనిట్లతో మొదటి స్థానంలో అజేయంగా నిలిచింది.
టీవీఎస్ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం ఆ కంపెనీ వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో, ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో సాధించిన పట్టు. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ మోడల్ ఈవీ సెగ్మెంట్లో దుమ్మురేపుతోంది. ఇక పెట్రోల్ విభాగంలో అపాచీ సిరీస్ బైకులు, జుపిటర్ స్కూటర్లు రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. జుపిటర్ ప్రస్తుతం హోండా యాక్టివా తర్వాత భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో స్కూటర్‌గా నిలిచింది.
అమ్మకాలే కాదు, ఎగుమతుల్లోనూ టీవీఎస్ దూసుకుపోతోంది. ఆఫ్రికా మార్కెట్లలో ఇప్పటికే బలమైన పునాది వేసుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలపై కన్నేసింది. అక్కడ బజాజ్ ఆటోకు గట్టి పోటీనిస్తూ తన అపాచీ సిరీస్‌ను విస్తరిస్తోంది. అయితే యమహాకు ఇప్పుడు పెద్ద సవాలు ఎదురవుతోంది. టీవీఎస్ ఈవీల రేంజ్, ఫీచర్లతో పోలిస్తే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు వెనుకంజలో ఉన్నాయి. 2026లో తన మూడవ స్థానాన్ని పదిలం చేసుకోవాలని టీవీఎస్ చూస్తుంటే, పట్టు కోల్పోయిన యమహా మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




