SBI ATM Charges: ఎస్బిఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఏటీఎం ఛార్జీలు పెంపు..!

Highlights

SBI ATM Charges: ఎస్బిఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఏటీఎం ఛార్జీలు పెంపు..!

SBI ATM Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఏటీఎం సేవలపై వసూలు చేసే ఛార్జీలను తాజాగా పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహించినప్పుడు చెల్లించాల్సిన ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంకు స్పష్టం చేసింది. ఈ సవరించిన ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇదే తరహాలో గత ఏడాది ఫిబ్రవరిలోనూ ఏటీఎం ఛార్జీల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే.

సేవింగ్స్ ఖాతాదారుల విషయానికి వస్తే, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు మొత్తం ఐదు ఉచిత లావాదేవీలు (నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు కలిపి) చేసుకునే అవకాశం కొనసాగుతోంది. అయితే ఈ ఉచిత పరిమితిని మించిన తర్వాత నగదు ఉపసంహరణకు ప్రతిసారి రూ.23తో పాటు జీఎస్టీ వసూలు చేస్తారు. గతంలో ఈ ఛార్జీ రూ.21 ప్లస్ జీఎస్టీగా ఉండేది. అలాగే బ్యాలెన్స్ తెలుసుకోవడం, మినీ స్టేట్‌మెంట్ తీసుకోవడం వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు ఇప్పుడు రూ.11 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు. ఇంతకుముందు ఈ ఛార్జీ రూ.10 ప్లస్ జీఎస్టీగా ఉండేది.

శాలరీ అకౌంట్ హోల్డర్లకు కూడా నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమితంగా ఉచిత లావాదేవీలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం నెలకు మొత్తం 10 ఉచిత లావాదేవీలకే పరిమితం చేశారు. ఈ ఉచిత లిమిట్ దాటిన తర్వాత సేవింగ్స్ ఖాతాదారుల్లాగే నగదు ఉపసంహరణకు రూ.23 ప్లస్ జీఎస్టీ, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.11 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే SBIకి చెందిన స్వంత ఏటీఎంలలో మాత్రం ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. అక్కడ ఉచిత లావాదేవీల విధానం పాత విధంగానే కొనసాగుతోంది.

ఈ ఛార్జీల పెంపు సేవింగ్స్, శాలరీ ఖాతాదారులు ఫ్రీ లిమిట్‌ను మించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ హోల్డర్లపై కూడా ఈ సవరణల ప్రభావం ఉంటుంది. అయితే పెన్షనర్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులు, కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) వంటి ప్రత్యేక ఖాతాల వారికి పూర్తిగా మినహాయింపులు లేదా తక్కువ ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. ఇవి ఖాతా రకాన్ని బట్టి మారుతాయి.

ఈ మార్పులు మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ఉచిత ఏటీఎం లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలకు అనుగుణంగానే అమలులోకి వచ్చాయని SBI తెలిపింది. ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎంల వినియోగంపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజా వివరాలు, పూర్తి సమాచారం కోసం SBI అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించడం మంచిదని బ్యాంకు సూచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories