Budget 2026 : నేడే బడ్జెట్..నిర్మలమ్మ లెక్కల పైనే ప్రపంచ దేశాల కళ్లు

Budget 2026 : నేడే బడ్జెట్..నిర్మలమ్మ లెక్కల పైనే ప్రపంచ దేశాల కళ్లు
x
Highlights

నేడే బడ్జెట్..నిర్మలమ్మ లెక్కల పైనే ప్రపంచ దేశాల కళ్లు

Budget 2026 : నేడు దేశ ఆర్థిక చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. కేవలం భారతదేశమే కాకుండా అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు కూడా భారత్ తీసుకోబోయే ఆర్థిక నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

నేడు భారత ఆర్థిక వ్యవస్థకు అగ్నిపరీక్ష లాంటిది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతంలో బ్రిటీష్ కాలం నాటి లెదర్ బ్రీఫ్‌కేసులను వాడే సంప్రదాయానికి స్వస్తి పలికి, 2019 నుండి ఆమె ఎర్రటి వస్త్రంతో చుట్టిన బహీ-ఖాతా సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. అయితే గత నాలుగేళ్లుగా ఇది పూర్తిగా డిజిటల్ రూపంలో (టాబ్లెట్ ద్వారా) పేపర్ లెస్ బడ్జెట్‌గా సాగుతోంది. ఈసారి బడ్జెట్‌లో ముఖ్యంగా దిగుమతి సుంకాలు, ఆదాయ పన్ను మినహాయింపులపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని సామాన్యులు, వ్యాపారవేత్తలు ఆత్రుతగా ఉన్నారు.

దేశ ఆర్థిక స్థితిగతులను సూచించే ఫేషియల్ డెఫిషిట్ పై ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటన ఉండబోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీన్ని 4.4 శాతంగా అంచనా వేయగా, వచ్చే ఏడాదికి దీన్ని 4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం అప్పులను తగ్గించుకుంటేనే దేశ ఆర్థిక రేటింగ్ మెరుగుపడుతుంది. ఇందుకోసం మార్కెట్ నుండి ప్రభుత్వం చేసే అప్పులను రూ.14.80 లక్షల కోట్లు దాటకుండా నియంత్రించే అవకాశం ఉంది. ఈ లోటు తగ్గితే రూపాయి విలువ పెరిగి, విదేశీ పెట్టుబడులు మన దేశానికి క్యూ కడతాయి.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఈసారి అక్షరాలా రూ.12 లక్షల కోట్లకు పైగా కేటాయించవచ్చని సమాచారం. రోడ్లు, రైల్వేలు, పోర్టుల నిర్మాణానికి భారీగా నిధులు ఇస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సిమెంట్, స్టీల్ వంటి రంగాలకు దీనివల్ల మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక ఆదాయం విషయానికి వస్తే, జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.11.78 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి 10.5 నుంచి 11 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా చేసుకుని భారత్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నేటి బడ్జెట్ భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారడానికి ఎంతటి వేగాన్ని ఇస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories