Gold Price Today : యుద్ధం తెచ్చిన తిప్పలు.. భగ్గుమంటున్న బంగారం, ఆకాశాన్నంటుతున్న వెండి రేట్లు

Gold Price Today : యుద్ధం తెచ్చిన తిప్పలు.. భగ్గుమంటున్న బంగారం, ఆకాశాన్నంటుతున్న వెండి రేట్లు
x
Highlights

యుద్ధం తెచ్చిన తిప్పలు.. భగ్గుమంటున్న బంగారం, ఆకాశాన్నంటుతున్న వెండి రేట్లు

Gold Price Today : ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణవార్తతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మళ్లించారు. దీంతో పసిడికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగి, ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో మున్ముందు ధరలు మరిన్ని రికార్డులను సృష్టించేలా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, డాలర్ విలువలో మార్పులు రావడం కూడా పసిడి ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. ఈ ఉద్రిక్తతలు తగ్గే వరకు పసిడి, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకునే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధర కూడా ఊహించని రీతిలో పెరగడం కొనుగోలుదారులను షాక్‌కు గురిచేస్తోంది. ఆదివారం నాడు దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1,68,710 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,650గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉన్నాయి; అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,69,640 పలుకుతుండగా, ఢిల్లీలో రూ.1,68,860 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరలు నమోదయ్యాయి.

వెండి ధరలు కూడా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా రూ.3.20 లక్షలకు చేరుకుంది. ఢిల్లీ, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సమయంలో ఇలా ధరలు అమాంతం పెరగడం సామాన్య కుటుంబాలకు పెను భారంగా మారింది. యుద్ధ భయాలు వీడితే తప్ప ఈ ధరలు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories