
వెండిలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా.. నిపుణులు ఏమంటున్నారంటే?
వెండి ధరల్లో ఇటీవల మార్పులు పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వెండిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న దానిపై నిపుణులు విశ్లేషణ ఇస్తున్నారు.
ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు.. ఎంత వరకు కూడబెట్టామన్నేది ముఖ్యం. ఈ రోజుల్లో అనేక ఆన్లైన్ యాప్‌లు ఫోన్లలలో నిక్షిప్తమై డబ్బును కూడబెట్టనీయకుండా చేయడంలో చాలా వరకు సఫలం అవుతున్నాయి. నిజానికి మీలో ఎంత మంది సంపాదించిన డబ్బులను కూడబెట్టాలని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో వెండి ధరలకు రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తున్నాయి. ఎప్పుడైనా మీరు వెండిలో పెట్టుబడి పెట్టాలని అనుకున్నారా.. ఒకవేళ అనుకుంటే ఈ టైంలో వెండిలో పెట్టుబడి పెట్టడం కరెక్టేనా. ఈ స్టోరీలో వెండి ధరల్లో ఎప్పుడు, ఎంత మొత్తంలో పెట్టుబడి పెడితే మంచిదో తెలుసుకుందాం.
పలువురు ఆర్థిక నిపుణుల అభిప్రాయంలో.. వెండిలో పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలికంగా మంచి నిర్ణయమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని లాభనష్టాలను బేరీజు వేసుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు. ఈరోజుల్లో వెండిపై పెట్టుబడి పెట్టే ముందు మీరు గమనించాల్సిన కీలక అంశాలను ఇందులో తెలుసుకుందాం.
* వెండిలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి..
పరిశ్రమల్లో బంగారం కంటే వెండికి (ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు) డిమాండ్ ఎక్కువ. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వెండి అవసరం పెరుగుతుంది. రూపాయి విలువ తగ్గుతున్నప్పుడు లేదా ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు, వెండి వంటి లోహాలు మీ డబ్బు విలువను కాపాడతాయి. బంగారం కొనలేని వారు తక్కువ బడ్జెట్‌తో వెండిలో పెట్టుబడి ప్రారంభించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
* వెండి పెట్టుబడుల్లో ఇబ్బందులు ఏమిటి..
ఈ రోజుల్లో బంగారం కంటే వెండి ధరలు చాలా వేగంగా మారుతుంటాయి. ఒక్కోసారి భారీగా పెరిగినా, అంతే వేగంగా తగ్గే ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వెండిని భౌతిక రూపంలో కొంటే సెక్యూరిటీ సమస్యలు ఏర్పడవచ్చు.
వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గాలు ఇవే..
మీరు వెండిని కేవలం నగలుగా కాకుండా పెట్టుబడి కోణంలో చూస్తుంటే, ఈ క్రింది మార్గాల్లో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సిల్వర్ ఈటీఎఫ్‌లు: ఇది వెండిని భౌతిక రూపంలో కాకుండా పేపర్ లేదా డిజిటల్ రూపంలో స్టాక్ మార్కెట్ ద్వారా కొనే పద్ధతి. ఒక సిల్వర్ ఈటీఎఫ్‌లు యూనిట్ ధర మార్కెట్‌లో ఒక గ్రాము వెండి ధరతో సమానంగా ఉంటుంది. సిల్వర్ ఈటీఎఫ్‌లలో కొనుగోలు చేసిన వెండిని మీ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి దొంగతనం చేస్తారనే భయం ఉండదు. వెండి క్వాలిటీ గురించి ఆందోళన చెందక్కర్లేదు (99.9% స్వచ్ఛత గల వెండిలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి). మీకు ఎప్పుడు డబ్బులు కావాలన్న మీ మొబైల్ యాప్ ద్వారా ఒక్క క్లిక్‌తో వెండిని అమ్మి నగదును నేరుగా బ్యాంకు ఖాతాలోకి పొందవచ్చు. డీమ్యాట్ ఖాతా ఉన్నవారందరూ ఈ సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.
డిజిటల్ వెండి: ఫోన్ పే, గూగుల్ పే, లేదా పేటీఎం వంటి మొబైల్ యాప్స్ ద్వారా వెండిలో పెట్టుబడిని పెట్టే పద్ధతిని డిజిటల్ సిల్వర్ అంటారు. ఇందులో మీరు కేవలం రూ.10 లేదా రూ.100 తో కూడా వెండిని కొనవచ్చు. మీరు కొన్న వెండిని సదరు కంపెనీ వారు మీ తరపున సురక్షితమైన లాకర్లలో భద్రపరుస్తారు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్కడికీ వెళ్లకుండా ఫోన్ నుంచే 24/7 ఇందులో వెండిని కొనవచ్చు లేదా అమ్మవచ్చు. మీకు కావాలంటే, కొంత ఛార్జ్ చెల్లించి ఆ వెండిని కాయిన్ రూపంలో ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు.
వెండి నాణేలు, కడ్డీలు: వెండిని ముట్టుకోగలిగేలా దగ్గర ఉంచుకోవాలనుకునే వారికి ఇది పాతకాలం నుంచి అందుబాటులో ఉన్న పద్ధతి. వీటిని నమ్మకమైన జ్యువెలరీ షాపుల్లో లేదా బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అత్యవసర సమయంలో ఎవరికైనా ఇచ్చి డబ్బు కూడా తీసుకోవచ్చు. వాస్తవానికి ఆభరణాల (నగలు) మీద మేకింగ్ ఛార్జీలు, తరుగు ఎక్కువగా ఉంటాయి. కానీ కాయిన్స్ లేదా బిస్కెట్ల మీద ఈ అదనపు ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తుంటే సిల్వర్ ఈటీఎఫ్‌లు ది బెస్ట్‌గా చెబుతున్నారు. తక్కువ డబ్బుతో మొదలు పెట్టాలనుకునే వారికి డిజిటల్ సిల్వర్ మంచి ఛాయిస్ అని పేర్కొంటున్నారు. పండగలు లేదా శుభకార్యాల కోసం వెండిని దాచుకోవాలంటే కాయిన్స్ లేదా కడ్డీల రూపంలో తీసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కనీసం 3 నుంచి 5 ఏళ్ల కాల పరిమితితో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపికగా చెబుతున్నారు. అయితే మీ మొత్తం పెట్టుబడిలో 5-10% కంటే ఎక్కువ వెండిపై పెట్టకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువపై ఆధారపడి ప్రతిరోజూ మారుతుంటాయి. మీరు వెండి కొనుగోలు చేయడానికి ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించుకోండి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




