Indian Rupee: ముడి చమురు మంటల్లో రూపాయి విలువ పతనం.. డాలర్‌తో పోలిస్తే ఎంత తగ్గిందంటే!

Indian Rupee
x

Indian Rupee: ముడి చమురు మంటల్లో రూపాయి విలువ పతనం.. డాలర్‌తో పోలిస్తే ఎంత తగ్గిందంటే!

Highlights

Indian Rupee: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాలర్‌తో పోలిస్తే 92.52 కనిష్ట స్థాయికి పడిపోయింది.

భారత ఆర్థిక వ్యవస్థకు సోమవారం గట్టి షాక్ తగిలింది. ఒకవైపు స్టాక్ మార్కెట్ల కుప్పకూలడం, మరోవైపు భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప స్థాయికి పడిపోవడం జరిగింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం డాలర్‌తో పోలిస్తే 92.33 వద్ద ప్రారంభమైన రూపాయి, కొద్దిసేపటికే 92.52 ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. ఒక్కరోజే దాదాపు 44 పైసలు (0.60%) మేర విలువ కోల్పోయింది.

రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే..

* భగ్గుమంటున్న ముడి చమురు ధరలు: మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. సరఫరాలో అంతరాయం కలగవచ్చనే భయంతో బ్యారెల్ చమురు ధర $120 మార్కుకు చేరువలో ఉంది.

* డాలర్లకు పెరిగిన డిమాండ్: భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయంగా చమురు కొనాలంటే చెల్లింపులు డాలర్లలోనే చేయాలి. ధరలు పెరగడం వల్ల గతంలో కంటే ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. డాలర్లకు విపరీతమైన డిమాండ్ పెరగడం వల్ల రూపాయి విలువ క్రమంగా తగ్గిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

* పెరుగుతున్న వాణిజ్య లోటు: మనం ఎగుమతి చేసే వస్తువుల కంటే, దిగుమతి చేసుకునే వస్తువుల విలువ (ముఖ్యంగా చమురు) పెరగడం వల్ల వాణిజ్య లోటు (Trade Deficit) వేగంగా పెరుగుతోందంటున్నారు. ఇది దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచి, రూపాయిని మరింత బలహీనపరుస్తోందని చెబుతున్నారు.

సామాన్యుడిపై పడే ప్రభావం ఇదే..

రూపాయి విలువ తగ్గడం వల్ల కలిగే నష్టం నేరుగా ప్రజల జేబుపై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రూపాయి విలువ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. మొత్తంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి బతుకు భారమవుతుందని చెబుతున్నారు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తన వద్ద ఉన్న డాలర్ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా రూపాయిని స్థిరీకరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు విడిపోనంత వరకు రూపాయిపై ఒత్తిడి ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories