Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ షాక్.. 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన

Microsoft
x

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ షాక్.. 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన

Highlights

Microsoft: ఐటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించబోతోంది.

Microsoft: ఐటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించబోతోంది. ఈసారి కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4% మందిని, అంటే సుమారు 9,100 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనుంది. 2023 తర్వాత జరుగుతున్న అతి పెద్ద లేఆఫ్ ఇదేనని సియాటెల్ టైమ్స్ నివేదించింది. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, ఖర్చులను తగ్గించుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. గత ఏడాది కూడా ఇదే విధమైన ధోరణి కనిపించింది.

జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, ఈ తాజా తొలగింపులపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే సేల్స్ డిపార్ట్‌మెంట్‌లోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తోంది.

మైక్రోసాఫ్ట్ ఇంతకుముందు కూడా ఉద్యోగులను తొలగించింది. మే 2025లో, కంపెనీ సుమారు 6,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది గత కొన్ని సంవత్సరాలలో కంపెనీ చేసిన అతి పెద్ద తొలగింపులలో ఒకటిగా పరిగణించబడింది. ఆ తర్వాత, జూన్ ప్రారంభంలో కూడా 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. బ్లూమ్‌బెర్గ్, వాషింగ్టన్ రాష్ట్రానికి ఇచ్చిన నోటీసుల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

గతంలో జరిగిన తొలగింపుల మాదిరిగా కాకుండా, ఈసారి తొలగింపులు కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లేదా ప్రొడక్ట్ డెవలపర్‌లకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఈసారి ఎక్కువగా వినియోగదారులతో నేరుగా పనిచేసే, అంటే సేల్స్, మార్కెటింగ్ విభాగాలపై ప్రభావం పడనుంది.

జూన్ 2024 నాటికి కంపెనీ సేల్స్, మార్కెటింగ్ టీమ్‌లో సుమారు 45,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇది కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో గణనీయమైన భాగం. మైక్రోసాఫ్ట్ ఈ మార్పుల గురించి ఏప్రిల్ 2025లోనే సంకేతాలు ఇచ్చింది. అప్పుడు కంపెనీ చిన్న, మధ్య తరహా వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్ అమ్మకాల పనిని థర్డ్-పార్టీ ఏజెన్సీలకు అప్పగిస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం, సేల్స్ విభాగంలో ఉద్యోగుల తొలగింపులకు దారి తీయవచ్చని అప్పట్లోనే అంచనా వేసారు.

పెరుగుతున్న ఆర్ధిక సవాళ్లు, సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వంటి కొత్త టెక్నాలజీల విస్తరణ వంటివి కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి దారితీస్తున్నాయి. ఇది రాబోయే కాలంలో మరిన్ని తొలగింపులకు దారి తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories