
75 ఏళ్ల సాంప్రదాయానికి బ్రేక్..నిర్మలమ్మ కొత్త ప్లాన్‌తో దేశ ముఖచిత్రం మారనుందా?
Budget 2026: నేడు ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న వేళ, యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈసారి అందరి దృష్టి కేవలం పన్ను రాయితీల మీద మాత్రమే లేదు, బడ్జెట్ ప్రసంగం సాగే విధానం మీద కూడా ఉంది. సాధారణంగా బడ్జెట్ ప్రసంగం రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-A, పార్ట్-B. గత ఏడు దశాబ్దాలుగా పార్ట్-A కే అత్యంత ప్రాధాన్యత ఉండేది. ఇందులో ప్రభుత్వం ఏ ఏ రంగాలకు ఎన్ని నిధులు కేటాయిస్తోంది, బడ్జెట్ అంచనాలు ఏంటి అనే వివరాలు ఉండేవి. పార్ట్-B అనేది కేవలం పన్నుల ప్రతిపాదనలు, ముగింపు మాటలతో ఒక ఫార్మాలిటీగా ఉండేది. కానీ ఈసారి కథ మొత్తం అడ్డం తిరగబోతోంది.
ఈ ఏడాది బడ్జెట్‌లో పార్ట్-Bని ప్రభుత్వం అత్యంత శక్తివంతంగా తయారు చేసినట్లు సమాచారం. ఇది కేవలం పన్నుల ప్రకటనలకే పరిమితం కాకుండా రాబోయే ఐదేళ్ల కాలానికి దేశ ఆర్థిక దిశను నిర్దేశించే ఒక బలమైన పాలసీ స్టేట్మెంట్గా ఉండబోతోంది. అంటే ప్రభుత్వం కేవలం నేటి ఖర్చుల గురించి కాకుండా, భవిష్యత్తులో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎలా ఎదగబోతుందో వివరించే వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను ఇందులో పెట్టబోతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విదేశీ వాణిజ్య విధానాల్లో మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో, భారత్ ఒక సుస్థిరమైన, పెట్టుబడులకు అనువైన దేశమని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.
విదేశీ ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేలా, దీర్ఘకాలిక విధానాలను పార్ట్-Bలో పొందుపరచడం ద్వారా భారత్ తన ఆర్థిక పటిష్టతను చాటుకోనుంది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే లోనే దీనికి సంబంధించిన సంకేతాలు కనిపించాయి. దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచడానికి మల్టీ-ప్రాంగ్డ్ స్ట్రాటజీ (బహుముఖ వ్యూహం) అవసరమని సర్వే పేర్కొంది. దీనికి అనుగుణంగానే నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకొచ్చే సంస్కరణలను ప్రకటించనున్నారు. ఇది సామాన్యుడికి అర్థమయ్యేలా ఉండటమే కాకుండా, అంతర్జాతీయ విపణిలో భారత్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా ఉండబోతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




