Option Hedging: స్టాక్ మార్కెట్ మునిగినా మీ డబ్బుకు ఏ డోకా ఉండదు! ఎలాగో తెలుసా?
Option Hedging: స్టాక్ మార్కెట్ ఆకస్మిక పతనాల నుంచి మీ పెట్టుబడిని కాపాడుకోవాలనుకుంటున్నారా? 'ఆప్షన్ హెడ్జింగ్' అనే దాని గురించి తెలుసా.. మీకు తెలియకపోతే దాని పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి. ప్రొటెక్టివ్ పుట్, కవర్డ్ కాల్ వంటి వ్యూహాలతో మీ పోర్ట్‌ఫోలియోను ఎలా సురక్షితం చేసుకోవాలో తెలుసుకోండి.
Option Hedging: స్టాక్ మార్కెట్ మునిగినా మీ డబ్బుకు ఏ డోకా ఉండదు! ఎలాగో తెలుసా?
Option Hedging: మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ యుద్ధ భయాలు, ఆర్థిక మాంద్యం లేదా అంతర్జాతీయ సంక్షోభాలు మొదలైనప్పుడు షేర్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతుంటాయి. ఇలాంటి సమయంలో సామాన్య పెట్టుబడిదారులు కంగారుపడి షేర్లను అమ్మేస్తుంటే, అనుభవజ్ఞులైన ట్రేడర్లు మాత్రం 'ఆప్షన్ హెడ్జింగ్' (Option Hedging) అనే ఆయుధాన్ని వాడుతారు. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి మీ పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవడానికి ఉపయోగపడే 'ఆప్షన్ హెడ్జింగ్' గురించి మీకు తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు హెడ్జింగ్ అంటే ఏమిటి..
మనం మన కారుకు ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం కోసం ఎలాగైతే 'ఇన్సూరెన్స్' (బీమా) చేయిస్తామో, షేర్ల ధరలు పడిపోయినప్పుడు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి చేసుకునే ఆర్థిక బీమాయే ఈ హెడ్జింగ్. సాంకేతికంగా చెప్పాలంటే.. మీ దగ్గర ఉన్న షేర్లకు వ్యతిరేక దిశలో (కాల్ లేదా పుట్ ఆప్షన్ల ద్వారా) ఒక పొజిషన్‌ను క్రియేట్ చేయడం. దీనివల్ల మార్కెట్ పడినా, షేర్లలో వచ్చే నష్టాన్ని ఆప్షన్లలో వచ్చే లాభం బ్యాలెన్స్ చేస్తుంది.
ముఖ్యమైన మూడు హెడ్జింగ్ పద్ధతులు ఇవే..
ప్రొటెక్టివ్ పుట్ (Protective Put):
మీ దగ్గర మంచి కంపెనీ షేర్లు ఉన్నప్పుడు, వాటి ధర పడిపోతుందని భయం ఉంటే.. అదే కంపెనీకి చెందిన 'పుట్ ఆప్షన్' (Put Option) కొనుగోలు చేయాలి. ఒకవేళ స్టాక్ ధర 10% పడితే, మీ పుట్ ఆప్షన్ విలువ 20-30% పెరిగి మీ నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఉత్తమమైన మార్గం అని మార్కె్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కవర్డ్ కాల్ (Covered Call):
మార్కెట్ పెద్దగా పెరగకుండా ఒకే రేంజ్‌లో (Sideways) ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో మీ దగ్గర ఉన్న షేర్లపై 'కాల్ ఆప్షన్' (Call Option) ను అమ్ముతారు. దీనివల్ల మీకు తక్షణమే 'ప్రీమియం' లభిస్తుంది. మార్కెట్ కదలకున్నా ఈ ప్రీమియం మీకు అదనపు ఆదాయం అవుతుంది.
ఇండెక్స్ హెడ్జింగ్ (Index Hedging):
మీ పోర్ట్‌ఫోలియోలో 10-15 రకాల షేర్లు ఉన్నప్పుడు, ప్రతి దానికీ విడిగా పుట్ ఆప్షన్లు కొనడం ఖరీదైన పని. ఇలాంటప్పుడు మొత్తం పోర్ట్‌ఫోలియోను రక్షించడానికి నిఫ్టీ (Nifty) లేదా బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty) ఇండెక్స్ పుట్ ఆప్షన్లను కొంటారు. దీనినే 'వైడ్ హెడ్జింగ్' అంటారు.
ఈ తప్పులు అస్సలు చేయకండి..
* హెడ్జింగ్ ఉచితం కాదు. మీరు ఆప్షన్ కొన్న ప్రతిసారీ ప్రీమియం చెల్లించాలి. ఇది మీ ఇన్సూరెన్స్ పాలసీకి కట్టే 'ప్రీమియం' లాంటిది.
* ఆప్షన్లకు గడువు తేదీ ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్నట్లు మార్కెట్ పడకపోతే, సమయం గడిచేకొద్దీ ఆప్షన్ విలువ తగ్గుతూ (Theta Decay) సున్నా అయిపోయే ప్రమాదం ఉంది.
* అతిగా హెడ్జింగ్ చేయడం వల్ల మీ అసలు లాభాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.
సాధారణ సమయాల్లో హెడ్జింగ్ అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కానీ మార్కెట్‌లో తీవ్ర అస్థిరత ఉన్నప్పుడు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఎన్నికల ఫలితాల సమయంలో లేదా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ వ్యూహాన్ని వాడటం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు. ఇది మీ కష్టార్జితానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ట్రేడింగ్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.




