Donald Trump: ట్రంప్ నిర్ణయంతో 2 నిమిషాల్లో 3 లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు

Donald Trump: ట్రంప్ నిర్ణయంతో 2 నిమిషాల్లో 3 లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు
x
Highlights

Donald Trump: గత ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్‌ కాస్త నెమ్మదిగా కనిపించినప్పటికీ... మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది.

Donald Trump: గత ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్‌ కాస్త నెమ్మదిగా కనిపించినప్పటికీ... మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 721 పాయింట్లు పెరిగి 77,905 వద్ద ట్రేడయ్యేంతగా, నిఫ్టీ 200 పాయింట్ల జంప్‌తో 23,561కి చేరుకుంది.

ట్రంప్ నిర్ణయంతో మార్కెట్ జోరు

భారత స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం. మెక్సికో, కెనడా దేశాలపై 25% టారిఫ్ (Import Duty) విధించాలని ఆయన గతంలో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని నెల రోజుల పాటు నిలిపివేయడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ఉత్సాహం చూపించాయి. ఈ ప్రభావంతోనే ఆసియాలోనూ స్టాక్ మార్కెట్లు రాకెట్‌లా ఎగసిపడ్డాయి.

రెండు నిమిషాల్లో రూ.3 లక్షల కోట్లు!

భారత స్టాక్ మార్కెట్ తెరిచిన కేవలం రెండు నిమిషాల్లోనే పెట్టుబడిదారులు భారీ లాభాలు పొందారు. ఫిబ్రవరి 3న ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో లిస్టెడ్ స్టాక్స్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,19,54,829.60 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 4న మార్కెట్ ప్రారంభమైన క్షణంలోనే అది రూ.4,22,57,970.28 కోట్లకు పెరిగింది. అంటే కేవలం 2 నిమిషాల్లోనే పెట్టుబడిదారులు రూ.3,03,140.68 కోట్లను సంపాదించగలిగారు.

సెన్సెక్స్, నిఫ్టీ గరిష్ట స్థాయికి

మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ రెండు బలమైన పెరుగుదలను చూపాయి. ఉదయం 10:13 గంటల సమయానికి:

* సెన్సెక్స్ – 653 పాయింట్లు పెరిగి 77,842.97 వద్ద ట్రేడింగ్ అయింది.

* నిఫ్టీ – 146.65 పాయింట్ల లాభంతో 23,507.70 వద్ద ట్రేడింగ్ అయింది.

మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు

* టారిఫ్‌పై ట్రంప్ యూ-టర్న్ – మెక్సికో, కెనడా దేశాలపై టారిఫ్ పెంచే నిర్ణయాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడం ఒక కారణంగా మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.

* అమెరికా మార్కెట్లు పుంజుకోవడం – డౌ జోన్స్ 550 పాయింట్లు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లకు మద్దతు లభించిందని నిపుణులు చెబుతున్నారు.

* చైనా మార్కెట్ల రీ-ఎంట్రీ – వారం రోజుల సెలవుల తర్వాత చైనా స్టాక్ మార్కెట్లు తెరుచుకోవడంతో ఆసియా మార్కెట్లలో సానుకూల వాతావణం కనిపించింది.

* FIIs, DIIs ధోరణి – సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) రూ.7,100 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు (DIIs) రూ.2,700 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.

ఈ విధంగా ట్రంప్ నిర్ణయం వల్ల భారత స్టాక్ మార్కెట్ కొత్త గరిష్ట స్థాయికి వెళ్లింది. పెట్టుబడిదారులకు ఈ పాజిటివ్ ట్రెండ్ మరికొంతకాలం కొనసాగుతుందా లేదా అనేది వేచిచూడాల్సిందే మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories