Tata Motors new factory: తమిళనాడులో టాటా జోరు.. రాణిపేటలో రూ. 9,000 కోట్ల ప్లాంట్ ప్రారంభం

Tata Motors new factory: తమిళనాడులో టాటా జోరు.. రాణిపేటలో రూ. 9,000 కోట్ల ప్లాంట్ ప్రారంభం
x

Tata Motors new factory: తమిళనాడులో టాటా జోరు.. రాణిపేటలో రూ. 9,000 కోట్ల ప్లాంట్ ప్రారంభం

Highlights

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) మరో భారీ అడుగు వేసింది.

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) మరో భారీ అడుగు వేసింది. తమిళనాడులోని రాణిపేట జిల్లా పాణపక్కంలో ఏర్పాటు చేసిన సరికొత్త అత్యాధునిక తయారీ కేంద్రాన్ని సోమవారం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పాల్గొని ప్లాంట్‌ను ప్రారంభించారు.

రూ. 9,000 కోట్లతో భారీ ప్రాజెక్టు

ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ కోసం టాటా మోటార్స్ రూ. 9,000 కోట్ల పెట్టుబడిని వెచ్చిస్తోంది. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో ఏడాదికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ టాటా మోటార్స్ వాహనాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (JLR) కార్లను కూడా తయారు చేయనున్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవ జ్ఞాపకార్థం ఇక్కడే తయారైన రేంజ్ రోవర్ ఎవోక్ కారును సీఎం స్టాలిన్ స్వయంగా డ్రైవ్ చేసి ఆవిష్కరించారు.

భారత్‌లో జేఎల్‌ఆర్ (JLR) కార్ల తయారీకి కేటాయించిన అత్యంత కీలకమైన కేంద్రంగా ఇది నిలవనుంది. ఇక్కడ తయారయ్యే కార్లు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లకు కూడా ఎగుమతి కానున్నాయి. ఈ తయారీ కేంద్రం పూర్తిగా పునరుత్పాదక ఇంధనం (Renewable Energy) తో పనిచేసేలా రూపొందించారు. ఇది కేవలం వాహన తయారీ కేంద్రమే కాకుండా, స్థిరమైన (Sustainable) తయారీకి ఒక నమూనాగా నిలుస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా పేరుగాంచిందని, టాటా గ్రూప్ రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించినట్లయిందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇలాంటి భారీ పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories