
UPI పేమెంట్స్ ఫ్రీ కదా.. PhonePe, Paytmలకు వేల కోట్ల ఆదాయం ఎలా వస్తోందో తెలుసా?
UPI ట్రాన్సాక్షన్లు ఫ్రీ అయినా, బ్యాంకింగ్ సేవలు, కమిషన్లు, ప్రకటనల ద్వారానే భారీ లాభాలు ఆర్జిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీలు.
ఈ రోజుల్లో చాలా మంది టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి చిన్న పేమెంట్‌కు UPI వాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో జరిగే డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 57% వాటా ఒక్క UPIదే అని నివేదికలు చెబుతున్నాయి. అయితే, వినియోగదారులుగా మనం చేసే పేమెంట్స్‌కు ఎలాంటి ఛార్జెస్ చెల్లించడం లేదు. మరి ఈ కంపెనీలు ఎలా నడుస్తున్నాయి? వాటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది? అనే ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే..
FY25 లో ఈ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల నికర ఆదాయం సుమారు రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా. సాధారణంగా మనం ఒకరికి పంపే డబ్బు (P2P) వల్ల వీరికి వచ్చే ఆదాయం 10% కంటే తక్కువ. అసలైన ఆదాయం వ్యాపారుల ద్వారా వస్తోంది. మొత్తం ఆదాయంలో 75% వాటా వ్యాపారులదే అని పలు నివేదికలు చెబుతున్నాయి. షాపుల్లో మనం చూసే సౌండ్‌బాక్స్‌లు, స్వైపింగ్ మెషీన్ల ద్వారా వ్యాపారుల నుంచి అద్దె రూపంలో వీటికి ఆదాయం వస్తుంది. FY25లో దీని ద్వారా దాదాపు రూ.2,000 కోట్లు లభించాయి. అలాగే కరెంటు బిల్లు, గ్యాస్, రీఛార్జ్ వంటి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా చేసే చెల్లింపులపై ఈ ప్లాట్‌ఫామ్‌లకు 8-10 బేసిస్ పాయింట్ల కమిషన్ వస్తుంది. ఈ ఏడాది ఈ లావాదేవీలు 80% పెరగడం విశేషం.
సాధారణ UPI లావాదేవీల కంటే క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రుసుములు ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులు క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు ఈ కంపెనీలకు ఎక్కువ లాభం ఉంటుంది. ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులను UPIకి లింక్ చేయడం పెరిగింది. క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో వీటి వాటా ఇప్పటికే 40%కి చేరింది, ఇది కంపెనీల మార్జిన్లను పెంచుతోంది. వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీల ఆదాయం ఏటా 20% పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. FY30 నాటికి నికర ఆదాయం రూ.38,500 కోట్లకు చేరుతుందని అంచనా. పేమెంట్స్ మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇచ్చే లోన్స్, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సేవలు అసలైన లాభాలను తెచ్చిపెట్టనున్నాయని అంటున్నారు.
ఒక్కో కస్టమర్‌పై ఎంత సంపాదిస్తున్నారంటే..
మనం నెలకు వేలల్లో లావాదేవీలు చేసినా, ఈ యాప్‌లు ఒక్కో కస్టమర్ మీద ఏడాదికి సంపాదించేది రూ.300 కంటే తక్కువ. ఇందులో లాభం కేవలం రూ.150 మాత్రమే. అదే ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ (ఉదాహరణకు SBI కార్డ్స్) ఒక్కో కస్టమర్ మీద ఏటా రూ.2,000 వరకు లాభం ఆర్జిస్తుంది. అందుకే ఇప్పుడు అన్ని UPI యాప్‌లు వినియోగదారులను క్రెడిట్ కార్డుల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. చూశారా మనం ఫ్రీగా వాడుతున్న UPI వెనుక ఎంత పెద్ద బిజినెస్ ఉందో. కేవలం డబ్బులు పంపడమే కాకుండా, వ్యాపార సేవలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఈ యాప్‌లు తమ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటున్నాయో అర్థం అయ్యిందా.
- UPI Revenue Model
- PhonePe Earnings
- Paytm Profit Secrets
- Digital Payments India
- Fintech Business Strategy
- How UPI apps make money without transaction fees
- UPI Soundbox rental income for banks
- Merchant Discount Rate (MDR) in UPI
- Rupay Credit Card on UPI benefits
- BBPS commission rates
- Future of UPI payments in India 2030

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




