Petrol Diesel Price : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
x
Highlights

సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price : ప్రపంచం ప్రస్తుతం మరో ఇంధన సంక్షోభం అంచున నిలబడింది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న విభేదాలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ప్రభావం సామాన్యుడి జేబుపై నేరుగా పడబోతోంది. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపించేలా కనిపిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ముదురు పాకాన పడ్డాయి. సెప్టెంబర్ తర్వాత మొదటిసారిగా బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల మార్కును దాటేశాయి. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటామని పరోక్షంగా బెదిరించడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. లండన్ మార్కెట్‌లో చమురు ధర 2.4 శాతం పెరగగా, అమెరికా బెంచ్‌మార్క్ అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 2.6 శాతం పెరిగి 64.82 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

అసలు వివాదం ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ తిరుగుతోంది. ఇరాన్ వెంటనే అణు చర్చలకు ముందుకు రావాలని, అది కూడా అందరికీ న్యాయంగా ఉండే ఒప్పందం కావాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దీనికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. అమెరికా ఏదైనా సైనిక సాహసానికి పాల్పడితే, ఇరాన్ స్పందన అత్యంత కఠినంగా మరియు వేగంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ మాటల యుద్ధం కాస్తా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ వివాదం గనుక ముదిరితే ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఇరాన్ రోజువారీగా ఉత్పత్తి చేసే 3 మిలియన్ బ్యారెళ్ల చమురు నిలిచిపోతే, మార్కెట్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి ఇన్వెస్టర్లు భయంతో చమురును నిల్వ చేసుకుంటుండటంతో డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

భారతదేశం వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది నిజంగా గడ్డు కాలమే. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర పెరిగితే, ఇక్కడ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదు. ఇది రవాణా ఖర్చులను పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటేలా చేస్తుంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం మరియు ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం రావడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న కొన్ని వారాలు చమురు మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories