
IRFC Stock : భారీగా పతనం అయిన IRFC షేర్లు.. 52 వారాల కనిష్టానికి స్టాక్.. కారణం ఇదే!
మార్కెట్ ఒత్తిడి, లాభాల బుకింగ్ ప్రభావం.. 52 వారాల కనిష్టానికి చేరిన IRFC షేర్‌పై ఇన్వెస్టర్ల దృష్టి!
రైల్వే రంగానికి చెందిన దిగ్గజ ప్రభుత్వ సంస్థ IRFC (Indian Railway Finance Corporation) షేర్లు స్టాక్ మార్కెట్‌లో ఒక్కసారిగా కుప్పకూలాయి. బుధవారం మార్కెట్ లాభాల్లో ఉన్నప్పటికీ, IRFC షేర్లు మాత్రం దాదాపు 4 శాతం పడిపోయి రూ.104.75 వద్దకు చేరాయి. ఇది ఈ ఏడాదిలోనే (52 వారాల్లో) అత్యంత కనిష్ట స్థాయి అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇంతకీ ఈ షేర్లు ఎందుకు పడిపోయాయో తెలుసా.. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. ప్రభుత్వం తన దగ్గర ఉన్న IRFC వాటాలో 4 శాతం వరకు విక్రయించాలని (Offer For Sale - OFS) నిర్ణయించింది.
ప్రభుత్వంలో IRFC లో 4 శాతం వాటాను ఫిబ్రవరి 25న పెద్ద సంస్థలకు, ఫిబ్రవరి 26న సామాన్య పెట్టుబడిదారులకు విక్రయించనుంది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఈ వాటాలను ఎందుకు అమ్ముతుందంటే.. ప్రస్తుతం IRFCలో ప్రభుత్వానికి 86.36 శాతం వాటా ఉంది. సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఏదైనా ప్రభుత్వ సంస్థలో ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలి (అంటే ప్రభుత్వ వాటా 75 శాతానికి మించకూడదు). ఈ నిబంధనను పాటించడం కోసమే ప్రభుత్వం తన వాటాను క్రమంగా తగ్గిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర తగ్గినప్పటికీ, కంపెనీ ఇంకా లాభాల్లోనే ఉంది. 2025 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో IRFC రూ.1,802 కోట్ల నికర లాభాన్ని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.27,000 కోట్లు దాటింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు రూ.1.37 లక్షల కోట్లుగా ఉంది.
కొత్తగా పెట్టుబడి పెట్టేవారు గమనించాల్సిన విషయాలు ఇవే..
IRFC షేర్ గత ఆరు నెలల్లో దాదాపు 15 శాతం నష్టపోయింది. ఒకప్పుడు రూ.148.90 వద్ద ఉన్న ఈ షేర్, ఇప్పుడు రూ.105 కి దగ్గరగా ఉంది. ప్రభుత్వ వాటా అమ్మకం వల్ల మార్కెట్‌లో షేర్ల సంఖ్య పెరిగి, ధరపై ఒత్తిడి పడుతోంది. అందుకే కొత్తగా పెట్టుబడి పెట్టేవారు లేదా ఇప్పటికే షేర్లు ఉన్నవారు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం తన వాటాను అమ్ముతుండటంతో IRFC షేర్ల ధర తగ్గుతోందని, కంపెనీ లాభాల్లో ఉన్నా, మార్కెట్ సెంటైమెంట్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




