
Fake ED raid Delhi
ఢిల్లీలో యజమాని ఇంట్లోనే ఈడీ అధికారులమని నటిస్తూ దోపిడీకి పాల్పడిన పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి
Fake ED raid Delhi: చాలా ఏళ్లుగా ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తోంది. యజమానులు కూడా ఆమెను ఇంటి మనిషిలానే చూశారు. దీంతో ఆ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు ఆమెకు తెలుసు. ఈ క్రమంలో ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చేది. అవి చాలవన్నట్టు ఇంకా పెద్ద దొంగతనం కోసం ప్లాన్ వేసింది. చక్కగా అమలు పరిచింది. కానీ, పోలీసులకు దొరికిపోయి జైలు పాలు అయింది. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో నివసించే 86 ఏళ్ల రిటైర్డ్ ఆర్కిటెక్ట్ ఆర్.సి. సబర్వాల్ ఇంట్లో ఫిబ్రవరి 11న సంచలన దోపిడీ జరిగింది. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులమని నటిస్తూ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నగదు, నగలను దోచుకెళ్లారు. ఈ దోపిడీ ఘటనలో ప్రధాన సూత్రధారిగా సదరు ఇంట్లో పని చేసే రేఖ దేవి అనే మహిళను, ఆమెకు సహకరించిన పూజా రాజ్‌పుత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈడీ అధికారులమంటూ..
తన యజమాని ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలుసుకున్న రేఖ దేవి, వాటిని కాజేయాలని పథకం వేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా తన స్నేహితులతో కలిసి ఈడీ అధికారుల వేషధారణలో వచ్చి, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఈ దోపిడీకి పాల్పడింది. సోదాల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు, కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బెదిరించారు.
Fake ED raid Delhi: దోపిడీ అనంతరం నిందితులు సుమారు రూ. 3 నుంచి 4 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో కారులో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులు సుమారు 350కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. హై-స్పీడ్ ట్రాఫిక్ కెమెరాలు, ప్రైవేట్ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులు వాడిన కారును గుర్తించారు.
పట్టించిన కారు..
ఈ కారు రేఖ దేవి వదిన పూజా రాజ్‌పుత్ ఇంటి వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పూజా రాజ్‌పుత్ ఇంటిపై దాడి చేయగా, దోపిడీకి ఉపయోగించిన పోలీసు యూనిఫాం, దొంగిలించిన లగ్జరీ గడియారాలు, విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రేఖ దేవిని, పూజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
పరారీలో..
ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న వారిలో ఐటిబిపి (ITBP) కానిస్టేబుల్ ప్రకాష్, రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉపదేశ్ సింగ్ థాపా, మనీష్ ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు పోలీసు యూనిఫాం ధరించి, ఈడీ పేరుతో ప్రజలను మోసం చేసి దోపిడీలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పనిచేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




