Noida : 27 కిలోమీటర్ల మేర ఛేజింగ్..నడిరోడ్డుపై 50 లక్షల ఫాలోవర్లున్న యూట్యూబర్‌పై దాడికి యత్నం

Noida : 27 కిలోమీటర్ల మేర ఛేజింగ్..నడిరోడ్డుపై 50 లక్షల ఫాలోవర్లున్న యూట్యూబర్‌పై దాడికి యత్నం
x
Highlights

27 కిలోమీటర్ల మేర ఛేజింగ్..నడిరోడ్డుపై 50 లక్షల ఫాలోవర్లున్న యూట్యూబర్‌పై దాడికి యత్నం

Noida : నోయిడాలో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో ఏకంగా 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఓ ప్రముఖ మహిళా యూట్యూబర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నడిరోడ్డుపై కారులో వెళ్తున్న ఆమెను కొందరు యువకులు ఏకంగా 27 కిలోమీటర్ల మేర వెంబడించి, వేధింపులకు గురిచేశారు. దేశ రాజధాని ప్రాంతంలో మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది. గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక ప్రముఖ మహిళా యూట్యూబర్, తన బీఎండబ్ల్యూ కారులో ఢిల్లీ నుంచి ఇంటికి వస్తుండగా ఈ భయంకరమైన సంఘటన ఎదురైంది. ఢిల్లీలోని డీఎన్‌డీ ఫ్లైఓవర్ నుంచి గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వరకు, అంటే దాదాపు 27 కిలోమీటర్ల దూరం ఆకతాయిలు ఆమెను వెంటాడారు. మరో కారులో ఉన్న కొందరు యువకులు ఆమె కారును ఓవర్‌టేక్ చేస్తూ, అసభ్యకరమైన సైగలు చేస్తూ తీవ్రంగా వేధించారు. ఆమె కారును అడ్డుకుని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురై తన భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది.

బాధితురాలి భర్త సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని బయటపెట్టారు. "ఢిల్లీ నుంచి పరి చౌక్ వరకు నా భార్యను వెంబడించినా, ఆ దారిలో ఎక్కడా ఒక్క పోలీసు కూడా కనిపించలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తన భార్యకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్య మహిళల భద్రత పరిస్థితి ఏంటని ఆయన పోలీసులను నిలదీశారు. తన భార్యపై దాడి జరిగిందని, కారును వెంబడించారని ఆరోపిస్తూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా తగిన న్యాయం జరగలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఈ కేసుపై నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వెర్షన్ మరోలా ఉంది. ప్రాథమిక విచారణ ప్రకారం.. రెండు కార్ల మధ్య చిన్నపాటి ప్రమాదం జరిగిందని, ఆ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని వారు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరుపక్షాలతో మాట్లాడారని, ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని పోలీసులు తెలిపారు. మహిళా యూట్యూబర్ తరపున ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఏది ఏమైనా, 27 కిలోమీటర్ల మేర ఒక మహిళా డ్రైవర్‌ను వెంబడించడం అనేది నోయిడా వంటి హైటెక్ నగరాల్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాత్రి వేళల్లో ఎక్స్‌ప్రెస్‌వేలపై పెట్రోలింగ్‌ను పెంచాలని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు చెబుతున్నట్లు ఇది కేవలం యాక్సిడెంట్ వివాదమా? లేక బాధితురాలు ఆరోపిస్తున్నట్లు నిజంగానే వెంటాడి వేధించారా? అన్నది తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories